Telangana MLC Polling 2021 : ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్, ఓటర్ తీర్పు ఎలా ఉండబోతోంది ?

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.

Telangana MLC Polling 2021 : ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్, ఓటర్ తీర్పు ఎలా ఉండబోతోంది ?

Telangana MLC Polling

MLC polling Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు అధికారులు. అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలేట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు ఓటర్లు. ఓటర్లు ఎవరికి ఓటు వేశారు ? ఎవరి వైపు మొగ్గు చూపారనే లెక్కల్లో బిజీ అయిపోయాయి పార్టీలు. తామంటే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్… ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. దీంతో జంబో బ్యాలెట్‌ను అధికారులు సిద్ధం చేశారు. 93 మంది అభ్యర్థుల్లో 13 మంది వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తుండగా 80 మంది ఇండిపెండెంట్లుగా బరిలో దిగారు. ఈ సెగ్మెంట్‌లో మొత్తం 5 లక్షల 31 వేల 268 మంది ఓటర్లున్నారు. రంగారెడ్డిలో అత్యధికంగా లక్షా 44వేల 416 మంది ఓటర్లుండగా.. అత్యంత తక్కువగా నారాయణ పేట్‌ జిల్లాలో 13వేల 899మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అటు వరంగల్‌ – ఖమ్మం- నల్లగొండ పట్ట భద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈసారి ఎన్నికల్లో 71 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 16 మంది పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మిగిలిన 55 మంది ఇండిపెండెట్లుగా బరిలో ఉన్నారు. ఈసారి అభ్యర్థులతోపాటు ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2 లక్షల 81 వేల 138 ఓట్లు ఉండగా.. లక్షా 53వేల 547ఓట్లు పోలయ్యాయి.