Shock to CM KCR: కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాయేతర కూటమిని పైకి తేవాలన్న కేసీఆర్ ఆలోచనకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్లయింది. కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ

Shock to CM KCR: కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ

National

Shock to CM KCR: జాతీయ స్థాయి రాజకీయాల్లో పాతుకుపోయిన కాంగ్రెస్, భాజపా వంటి పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా మరో పార్టీని లేదా కూటమిని ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో పలు ప్రాంతీయ పార్టీలను కూడగలుపుకుని నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తోనూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుపై అందరు సుముఖంగా ఉన్నట్లు సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు నేతలు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో మరో కూటమి సాధ్యం కాదంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి నవాబ్ మాలిక్ చెప్పుకొచ్చారు. జాతీయ కూటమి ఏర్పాటు పై మహా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయిన మరుసటి రోజే.. వారు ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.

Also read: Prakash Raj : రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌?

దీంతో.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాయేతర కూటమిని పైకి తేవాలన్న కేసీఆర్ ఆలోచనకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్లయింది. సోమవారం నాగపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ..”కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యపడుతుందని తాము భావించడం లేదని” అన్నారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుపై గతంలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై తాము ఇదే విషయాన్ని చెప్పామని, కాంగ్రెస్ లేకుండా కూటమికి దిశానిర్దేశం సాధ్యపడదని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. “దేశంలో ‘జాతీయ స్థాయి ప్రత్యామ్న్యాయ కూటమి’ అనే మాటలను ఇదివరకు చాలానే విన్నామని.. కానీ అవి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవని గుర్తు చేసిన సంజయ్ రౌత్.. కేవలం ఎన్నికలు వస్తున్నప్పుడు మాత్రమే ఇటువంటి ఫ్రంట్ ల గురించి మాట్లాడుతారు” అంటూ వ్యాఖ్యానించారు.

Also read: Chandrababu : ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్-చంద్రబాబు

అయితే.. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుకు పావులుకదుపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని సంజయ్ రౌత్ అన్నారు. కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే.. మరోసారి కీలక నేతలతో భేటీ అయి ఫ్రంట్ ఏర్పాటు పై సరైన నిర్ణయం తీసుకుంటారని రౌత్ వెల్లడించారు. ఇక ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలకు ముందు జాతీయ స్థాయి ప్రత్యామ్న్యాయ కూటమి ఏర్పాటు సాధ్యమేనని అన్నారు. అయితే అందులో కాంగ్రెస్ కు స్థానం కల్పిస్తేనే అది సాధ్యమౌతుందని..ఇది ఎప్పటి నుంచో తాము చెబుతున్న విషయమేనని మాలిక్ అన్నారు. కాగా, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్న్యాయంగా మరో పార్టీ(కూటమితో కూడిన) ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తుండగా.. ప్రస్తుతం ఈ నేతలు చేసిన వ్యాఖ్యలు..జాతీయ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.