Asia Cup 2023: జై షా వ్యవహరించిన తీరుపై పాకిస్థాన్ ఆగ్రహం

పాకిస్థాన్, శ్రీలంకలో ఆసియా క‌ప్ 2023 మ్యాచులు జరగనున్నాయి.

Asia Cup 2023: జై షా వ్యవహరించిన తీరుపై పాకిస్థాన్ ఆగ్రహం

Asia Cup 2023

Asia Cup 2023 – PCB: బీసీసీఐ (BCCI) కార్యదర్శి, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) అధ్యక్షుడు జై షా (Jay Shah) తాము నిర్వహించిన ఓ ఈవెంట్ కంటే ముందుగానే ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేసినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) అసంతృప్తి వ్యక్తం చేసింది. జై షా గత బుధవారం ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్, శ్రీలంకలో ఆసియా క‌ప్ 2023 మ్యాచులు జరగనున్నాయి. పీసీబీ గత బుధవారం సాయంత్రం లాహోర్‌లో అధికారికంగా ఓ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఆసియా కప్-2023 షెడ్యూల్‌ను, ట్రోఫీని ఆ వేదికపై నుంచి ఆవిష్కరించాలని భావించింది. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, పీసీబీ క్రికెట్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

అయితే, ఆ ఈవెంట్ కు అరగంట ముందు జై షా సోషల్ మీడియా ద్వారా ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించేశారు. లాహోర్ లో నిర్వహించే కార్యక్రమం ప్రారంభమైన 5 నిమిషాలకే తాము షెడ్యూల్ ను ప్రకటించాలని అనుకున్నామని, అంతకుముందే జై షా దాన్ని విడుదల చేయడం పట్ల పీసీబీ అసంతృప్తితో ఉందని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.

పీసీబీ వేడుకను జై షా చెడగొట్టారని చెప్పాయి. అయినప్పటికీ, ఈ ఈవెంట్లో షెడ్యూల్ ను పీసీబీ మళ్లీ విడుదల చేసిందని పేర్కొన్నాయి. దీనిపై ఏసీసీ ముందు పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈవెంట్ విషయాన్ని మరోలా అర్థం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని పీసీబీ చెప్పిందని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు చెప్పాయి. కాగా, ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఆసియా కప్-2023 జరగనుంది. పాక్ 4 మ్యాచ్‌లకు, శ్రీలంక 9 మ్యాచ్‌ల‌కు అతిథ్యం ఇస్తుంది.

Asia Cup 2023 Schedule : ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?