Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

సమస్యలను లేవనెత్తినప్పుడు బీజేపీ గట్టిగా మాట్లాడి తమ నోర్లు మూయిస్తుందని, ప్రశ్నించిన గొంతుకలను అణిచివేస్తుందని రాహుల్ ఆరోపించారు

Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

Rahul

Rahul Gandhi: ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్ లో ప్రస్తుత పరిస్థితులు అంతగా బాగోలేదని, ప్రధాని మోదీ దేశంలో సమస్యలను వినే వైఖరిలో లేరని రాహుల్ అన్నారు. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం లండన్ చేరుకున్న రాహుల్ గాంధీ ఈమేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, ఫలితంగా భారతదేశంలోని రాష్ట్రాలు..కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేకపోతున్నాయని రాహుల్ అన్నారు. సమస్యలను లేవనెత్తినప్పుడు బీజేపీ గట్టిగా మాట్లాడి తమ నోర్లు మూయిస్తుందని, ప్రశ్నించిన గొంతుకలను అణిచివేస్తుందని రాహుల్ ఆరోపించారు. దేశంలో పరిస్థితులపై “నేను వినాలనుకుంటున్నాను” అనే వైఖరి ప్రదర్శించాల్సిన ప్రధాన మంత్రి అందుకు విరుద్ధంగా ఎటువంటి విషయాలను వినే స్థితిలో ఆయన లేరంటూ ప్రధాని మోదీ పై ఘాటు విమర్శలు చేశారు. భారత్ తో ప్రజలకున్న అనుబంధాన్ని తాము విశ్వసిస్తున్నామని రాహుల్ అన్నారు.

భారత దేశాన్ని ‘బంగారు పక్షిగా’ భావిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు..దేశ ప్రయోజనాలను కొందరికే కట్టబెడుతున్నాయన్న రాహుల్.. ప్రజలందరికి సమాన ప్రాప్యత ఉండాలని మేము నమ్ముతున్నాము” అని తెలిపారు. దేశంలో సమస్యల సాధన దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న రాహుల్ దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే పదవిలో తామున్నామని, కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆ పని చేస్తున్నాయని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ ప్రజా ప్రయోజనమేనని..ప్రపంచ కేంద్ర బిందువుగా భారత్ ఉందని అన్నారు. మనకున్న స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని మనమే నిర్వహించు కోవాలని.. అది అస్తవ్యస్తం అయితే మిగతా ప్రపంచ దేశాలకు ఇబ్బందిని కలిగిస్తుంది, ”అని రాహుల్ వ్యాఖ్యానించారు. లండన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరియు టీఎంసీ నేత మహువా మోయిత్రా కూడా పాల్గొన్నారు.

Other Stories:Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన