Ashwini Vaishnav: ప్రమాద ఘటనకు గల కారణాలు.. అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు

ఘటనా స్థలంలో మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పునరుద్దరణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Ashwini Vaishnav: ప్రమాద ఘటనకు గల కారణాలు.. అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు

Railway Minister Ashwini Vaishnav

Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఆదివారం ఉదయం వరకు 288 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. బాలాసోర్‌లో రైలు ప్రమాదం తర్వాత పట్టాల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శనివారం అర్థరాత్రి వరకు ప్రమాద స్థలంలో ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షణ చేసిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ఉదయం తిరిగి ప్రమాద స్థలం వద్దకు చేరుకొని రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను పర్యేవేక్షించారు.

Odisha Train Accident : కోరమాండల్, యశ్వంత్‌పూర్ హౌరా రైళ్లలో లభ్యంకాని 141 మంది ఏపీ ప్రయాణీకుల ఆచూకీ

పునరుద్దరణ పనులు పర్యవేక్షణ..

ఒడిషా బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలిలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు 500 మీటర్ల మేర రైల్వే శాఖ కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తుంది. పునరుద్ధరణ పనుల్లో వెయ్యి మందికి‌పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ఏడు పొక్లెయిన్లు, రెండు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, మూడు నుంచి నాలుగు రైల్వే, రోడ్ క్రేన్లు మోహరించి మరమ్మతు పనులు చేస్తున్నారు. పట్టాలు తప్పిన భోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించి కొత్త పట్టాలు, ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ అధికారులు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ లు పర్యవేక్షించారు. కొత్త పట్టాల ఏర్పాటు, విద్యుత్ స్తంభాలు, ఎలక్ట్రిఫికేషన్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడం మా బాధ్యత అని మంత్రులు తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణ జరుగుతోంది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రులు చెప్పారు.

Odisha Train Accident : గతంలోనూ పలుసార్లు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఆ సమయంలో ఎంత మంది మరణించారంటే?

ప్రమాద ఘటనకు కారణాలను గుర్తించాం..

రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ..  రైలు ప్రమాద ఘటనకు కారణాలు, అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు తెలిపారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపారని రైల్వే మంత్రి తెలిపారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులపై దృష్టి సారించామని చెప్పారు. ఆదివారం సాయంత్రానికి ఒక మెయిన్‌లైన్ మరమ్మతు పనులు పూర్తవుతాయని, మరో మెయిన్ లైన్ పనులు కూడా ప్రారంభం అవుతాయని రైల్వే మంత్రి చెప్పారు. ట్రాక్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. బుధవారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. కవచ్‌కు రైలు ప్రమాదానికి సంబంధం లేదు. మమతా బెనర్జీ తనకు ఉన్న అవగాహనతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు వల్ల ప్రమాదం జరిగింది. రైల్వే సేఫ్టీ కమిషన్ దర్యాప్తు నివేదికలో అన్ని విషయాలు బయటపడతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదం నుంచి బయటపడి సొంత ప్రాంతానికి తెలుగు యువకులు.. ఏం చెప్పారంటే..?

రైల్వే మంత్రికి ప్రధాని మోదీ ఫోన్ ..

ఘటనా స్థలంలో మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పునరుద్దరణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉంటే రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల్లో భాగంగా గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ ను తొలగించారు. అతికష్టంగా ఈ ఇంజిన్‌ను తొలగించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.