India vs Ireland T20 Series: పసికూనలే అనుకుంటే పరాభవం పలుకరించినట్లే..! ఆ ఐదుగురు ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాలి
ప్రపంచ క్రికెట్ జట్లలో ఐర్లాండ్ పసికూనగా పేరున్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో విజయవంతమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా యువ ఆటగాళ్లు ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బొక్కబోర్లా పడే అవకాశాలే లేకపోలేదు.

India vs Ireland T20 Series
IRE vs IND T20 Match: భారత్ మరో పొట్టి పోరుకు సమాయత్తమైంది. వెస్టిండీస్ చేతిలో అనూహ్య ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమిండియా.. పసికూన ఐర్లాండ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య 18నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు డబ్లిన్ వేదికగా జరగనున్నాయి. ఆసియాకప్, స్వదేశంలో వన్డే ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది.
ప్రపంచ క్రికెట్ జట్లలో ఐర్లాండ్ పసికూనగా పేరున్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో విజయవంతమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా యువ ఆటగాళ్లు ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బొక్కబోర్లా పడే అవకాశాలు లేకపోలేదు. ఐర్లాండ్ జట్టులో ముఖ్యంగా ఐదుగురు కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. స్టెర్లింగ్ 129 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఒక సెంచరీ, 23 అర్థ సెంచరీలతో సహా 3,397 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ కూడా ఈ జట్టులో కీలక ప్లేయర్. టీ20 పార్మాట్‌లో బల్బిర్నీ 93 మ్యాచ్‌లు ఆడాడు. 23.11 సగటుతో 1965 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ జాషువా లిటిల్ పేరు మీకు బాగా తెలిసే ఉంటుంది. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇతడు 58 టీ20 మ్యాచ్ లు ఆడగా.. 68 వికెట్లు తీశాడు.
24ఏళ్ల ఆల్‌రౌండర్ కర్టిస్ క్యాంఫర్ కూడా భారత్‌కు కష్టాలు సృష్టించగలడు. క్యాఫర్ 39 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 24 సగటుతో 600 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 25 వికెట్లు తీశాడు. స్పిన్ బౌలర్ జార్జ్ డాక్రెల్ కూడా ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాడు. తన స్పిన్ బంతులతో భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే సత్తాఉంది. టీ20 ఫార్మాట్ లో 123 మ్యాచ్ లు ఆడిన డాక్రెల్ 886 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 82 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించగలడు. వీరితో పాటు మిగిలిన బ్యాటర్లు అవకాశాన్ని బట్టి మ్యాచ్ విన్నర్లుగా మారేవారు ఉన్నారు. టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఐర్లాండ్ ప్లేయర్స్ బలాలు, బలహీనతలపై దృష్టిసారించి అందుకు అనుగుణంగా మ్యాచ్ లో రాణిస్తే సునాయస విజయానికి అవకాశం ఉంటుంది. పసికూనలేకదా అని తేలిగ్గా తీసుకుంటే ఓటమి పలుకరించడం ఖాయం.
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ T20I సిరీస్ పూర్తి షెడ్యూల్..
ఐర్లాండ్ vs భారత్ 1వ T20: శుక్రవారం (ఆగస్టు 18 – ది విలేజ్, డబ్లిన్)
ఐర్లాండ్ vs భారత్ 2వ T20: ఆదివారం (ఆగస్టు 20 ది విలేజ్, డబ్లిన్)
ఐర్లాండ్ vs భారత్ 3వ T20: బుధవారం (ఆగస్టు 23 ది విలేజ్, డబ్లిన్)