Telangana BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి..బండి దూకుడుపై నిరసన గళం విప్పుతున్న అసంతృప్తి నేతలు..ఢిల్లీకి చేరిన పంచాయితీ

తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ అంతకంతకు పెరుగుతోంది. అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుపై నిరసన గళం విప్పుతున్నా అసంతృప్తి నేతలు..దీంతో వీరి పంచాయితీ ఢిల్లీకి చేరింది.

Telangana BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి..బండి దూకుడుపై నిరసన గళం విప్పుతున్న అసంతృప్తి నేతలు..ఢిల్లీకి చేరిన పంచాయితీ

Telangana Bjp

Telangana BJP leaders meeting in Delhi : ఓ పక్క ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆ ఐదు రాష్ట్రాల్లోను బీజేపీ జయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతుంటే..ఇప్పుడిప్పుడే తెలంగాణలో పట్టు సాధిస్తున్న బీజేపీలో ముసలం రాజుకుంది. పాత కొత్త నేతల కలయికతో అభిప్రాయభేధాలు వస్తున్నాయి. ఇవి ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్నా..ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా బయట పార్టీ లనుంచి బీజేపీలోకి వచ్చిన నేతలతో పాటు పాత సీనియర్ నేతలకు కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయాలు..అతని దూకుడు వ్యవహారం నచ్చటంలేదు.ఈక్రమంలో మంగళవారం (ఫిబ్రవరి 22,2022)కరీంనగర్ లో అసమ్మతి నేతల అసంతృప్తి గళాలపై సమావేశం పెట్టి మరీ సీరియస్ అయ్యారు బండి సంజయ్. సీనియర్ నేతలైనా సరే పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని..లేకుంటే వేటు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అసంతప్తి నేతల బండి హెచ్చరికలపై గుర్రుగా ఉన్నారు. దీంతో తెలంగాణ బీజేపీ అసంతృప్తి నేతల గళాలు మరింత పెద్దవి అయ్యాయి. బండి హెచ్చరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలు ఢిల్లీ వేదికగా పంచాయితీ పెట్టారు.

బండి పాతవారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ అసమ్మతి నేతల ఆవేదన..
బండి సంజయ్ పార్టీలో పాతవారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని BJP అసమ్మతి నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైద్రాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు సమావేశమయ్యారు. గతంలో కూడా సమావేశమైన నేతలే మరోసారి హైదరాబాద్ లో కూడా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశం తర్వాత అసమ్మతి నేతలు తమ గళాలను ఒక్కొక్కరుగా బయటపెట్టారు. బీజేపీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇంతకాలం పార్టీ అభివృద్ది కోసం పనిచేయలేదా? అని కాస్త ఆవేశంగా ప్రశ్నించారు. పార్టీ అభివృద్ది కోసం తాము కష్టపడిన విషయాన్ని వారు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది..మీ నిర్ణయాలు మామీద రుద్దవద్దు అంటూ కాస్త ఘాటుగానే సమావేశంలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు..వందలాది మంది కార్యకర్తల సమస్యగా సదరు నేతలు వాపోయారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని లేదంటే పార్టీ బలపడటం ఎలా ఉన్నా దెబ్బతినే అవకాశం ఉంటుందని సూచించారు.

బండి దూకుడు కళ్లెం వేయాలంటున్నఅసంతృప్తి నేతలు..సీక్రెట్ సమావేశాలతో మల్లగుల్లాలు..
కాగా..బండి సంజయ్‌పై అసమ్మతి సెగ రగులుతున్న క్రమంలో సంజయ్‌ ఒంటెత్తు పోకడలపై సీనియర్‌, జూనియర్‌ అన్న తేడాలేకుండా నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలా బండి తీరు నచ్చనివారంతా ఓకే వేదికగా తమ తమ గోడులు వెళ్లబోసుకుంటున్నారు. మంగళవారం బండి సొంత జిల్లా కరీంనగర్‌లోనూ పలువురు నేతలు రహస్యంగా సమావేశమై, బండికి వ్యతిరేకంగా చేయాల్సిన పనులపై చర్చించినట్టు సమాచారం. బండి తీరుపై పార్టీలోని సీనియర్‌ నేతలు ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కానీ బండి మాత్రం పెద్దగా ఎవరినీ లెక్కచేయట్లేదన్నట్లే ఉంది ఇంత తీవ్రంగా అసంతృప్తులు వెల్లువెత్తుతున్న తీరు చూస్తుంటే..ఇన్నాళ్లు పార్టీ కోసం ఓపికపట్టిన నేతలంతా ఇప్పుడు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు తన వరకు వచ్చేసరికి బండి మంగళవారం కరీంనగర్ లో సమావేశం పెట్టారు. సమావేశంలో కూడా బండి ఏమాత్రం తగ్గలేదు సరికదా..అసంతృప్తి నేతలకు మరింత ఆగ్రహం కలిగేలా హెచ్చరికలు జారీ చేశారు. వేటు పడుతుంది అది సీనియర్లు అయినా జూనియర్లు అయినా సరే అని వార్నింగ్ ఇచ్చేసరికి అసంతృప్తి నేతలు మరింతగా రగిలిపోయారు. ఏదోకటి చేయాల్సిందే..బండి దూకుడుకు కళ్లెం వేయాల్సిందేన అన్నట్లుగా తెలంగాణ బీజేపీ అసంతృప్తి నేతలంతా పంచాయితీని ఢిల్లీలో పెట్టారు.

రహస్య భేటీలతో గోడు వెళ్లబోసుకునే నేతలు ఒకేతాటిపైకి..
బండి సంజయ్‌ తీరుతో పార్టీలో ఇబ్బందులు పడుతున్న నేతలంతా ఒకే తాటిపైకి వస్తున్నారు. ఎక్కడికక్కడ రహస్య సమావేశాలు నిర్వహించి తమతమ వర్గాలను కూడగడుతున్నారు. ఇది ఏ ఒక్క జిల్లానో కాకుండా బండి సొంత జిల్లా అయిన కరీంనగర్‌ లో కూడా ఆయనపై వ్యతిరేకత వస్తోంది. సీనియర్ నేతలతో పాటు పలువురు అసంతృప్తి నేతలకు బండిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. బండిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో పంచాయితీ పెట్టారు. ఎంతోమంది నేతలు పార్టీలో ఇమడలేక బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతరైతే పార్టీని వీడటానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

బండి సంజయ్‌ తీరు మారకుంటే పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నాక తెలంగాణలో బీజేపీ బలపడటమే కాదు సీట్లు కూడా గెలుచుకుంది. దీంతో బండి మరింత దూకుడుగా వ్యవహరిస్తుంటే మిగిలిన నేతలు తట్టుకోలేకపోతున్నారు.అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో సమావేశాలతో తమ తమ గోడు ఒకరికి మరొకరు వెళ్లబోసుకుంటున్నారు. అసంతృప్తి నేతల విషయం అధిష్టానానికి కూడా తెలిసింది. దీంతో నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. అయినప్పటికీ అసంతృప్త నేతలు బేఖాతర్‌ చేస్తూ వరుసగా రహస్య సమావేశాలను నిర్వహిస్తు బండికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

హైదరాబాద్ లో మీటింగ్ లో కూడా బండిపై నిరసన గళాలు..
బండి సంజయ్ పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాజేశ్వర్‌రావు, నల్లగొండ నుంచి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, మహబూబ్‌నగర్‌లో నాగురావు నామోజీ, హైదరాబాద్‌లో వెంకటరమణి, వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌లో అల్జాపూర్‌ శ్రీనివాస్‌, మల్లారెడ్డి, ఆదిలాబాద్‌లో గోనె శ్యామ్‌ సుందర్‌రావు తదితర నేతలు బండి సంజయ్ పై అంసతృప్తిగా ఉన్నారు.

ఢిల్లీకి చేరిన నిరసన గళాలు..అధిష్టానంతో పంచాయితీ..
ఈక్రమంలో తాజాగా మంగళవారం సమావేశంతో మరింతగా రగిలిపోయిన బీజేపీ అసంతృప్తి నేతలు పంచాయితీని బీజేపీ పెద్దల ముందు పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ సహా కీలక నేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. మరికాసేపట్లో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తో బండి సంజయ్ సహా పలువురు నేతలు భేటీ కానున్నారు. పార్టీ ఐక్యత, నేతల మధ్య సమన్వయం అంశాలపై తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో బీజేపీ అధిష్టానం తెలంగాణ కాషాయ దళానికి ఎటువంటి సూచనలు ఇవ్వనుందో వేచి చూడాలి. లేదా పార్టీ పుంజుకునే సమయంలో ఇటువంటి సీక్రెట్ మీటింగ్స్ ఏంటీ అని చీవాట్లు వేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా బండి సంజయ్ మీద అధిష్టానికి మంచి అభిప్రాయం ఉన్నట్లుగా తెలుస్తోంది.దీనికి కారణం బండి అధ్యక్షుడి అయ్యాక బీజేపీలో కొత్త జోష్ వచ్చింది.సీట్లు కూడా గెలుచుకోవటంతో మరి అధిష్టానం బండికి సూచనలు ఇచ్చి..అసంతృప్తి నేతలను బుజ్జగిస్తుందో చీవాట్లు పెడుతుందో వేచి చూడాలి.