Central Minister Kishan Reddy: భయంకరమైన నిజాలు అంటూ.. కేసీఆర్ పాలనపై ఆసక్తికర ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు.. అంటూ ట్వీట్లో పేర్కొన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు.

central minister kishan Reddy
Central Minister Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. ఈక్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 75ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ అంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రం తీరు దరిద్రంగా ఉందంటూ విమర్శించారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై కేసీఆర్ ఒక్క నిమిషంకూడా మాట్లాడలేదని విమర్శించారు. కేంద్రంపై కేసీఆర్ బురద జల్లుతున్నారని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు అంటూ ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్ ఏం చెప్పిందో చూసి తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
భయంకరమైన నిజాలు!!
వ్యవసాయ ఋణాలలో జాతీయస్థాయిలో ఒక్కో రైతుకుటుంబం మీద ఉన్న సగటు ఋణం ₹74 వేలతో పోలిస్తే,తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబం మీద ఉన్న సగటు ఋణం ₹1.52 లక్షలు రెండు రెట్ల కంటే ఎక్కువ.
ఈ గణాంకాలు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతులమీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుంది. pic.twitter.com/2Jj5NkD0Qc
— G Kishan Reddy (@kishanreddybjp) February 13, 2023
తాజాగా సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు అంటూ ట్వీట్లో పేర్కొన్న కేంద్ర మంత్రి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు. వ్యవసాయ రుణాలలో జాతీయ స్థాయిలో ఒక్కో రైతు కుటుంబం మీద ఉన్న సగటు రుణం రూ. 74వేలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబం మీద ఉన్న సగటు రుణం రూ. 1.52 లక్షలు అని, అది రెండు రెట్ల కంటే ఎక్కువ అంటూ ట్వీట్ లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.