Virat Kohli: టాటూలకు భాగస్వామ్యానికి లింక్ పెట్టిన కోహ్లి.. ఏంటి బాసూ ఇది..!
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లి-డుప్లెసిస్ జంట విజయవంతం కావడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటనే ప్రశ్న విరాట్‌కు ఎదురైంది. ఇందుకు కోహ్లి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు

Virat Kohli Partnership With Faf du Plessis
Virat Kohli-Faf du Plessis : ఐపీఎల్(IPL) 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు అదరగొడుతోంది. ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ 7 మ్యాచుల్లో విజయం సాధించి 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా లేదా అన్న సంగతి కాస్త పక్కన బెడితే ఈ సీజన్‌లో బెంగళూరు సాధించిన విజయాల్లో విరాట్ కోహ్లి(Virat Kohli-), ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis) జోడి కీలక పాత్ర పోషించింది.
ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న విరాట్-డుప్లెసిస్ జోడి పవర్ ప్లే లో వికెట్ ఇవ్వకుండా వేగంగా పరుగులు చేస్తూ ప్రత్యర్ధి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతోంది. ఇక గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే వీరవిహారం చేశారు. విరాట్ కోహ్లి శతకంతో అలరించగా, డుప్లెసిస్ అర్ధశతకంతో సత్తాచాటాడు. మొదటి వికెట్‌కు 172 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లి-డుప్లెసిస్ జంట ఇంతలా విజయవంతం కావడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటనే ప్రశ్న విరాట్‌కు ఎదురైంది. ఇందుకు కోహ్లి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. కీలకమైన మ్యాచ్‌లో బాగా ఆడినప్పుడు తన ఆత్మ విశ్వాసం పెరుగుందని, అలాగే జట్టు సభ్యులందరిది కూడా అని అన్నాడు. విరాట్ కోహ్లి-డుప్లెసిస్ భాగస్వామ్యం వెనుక కారణం పచ్చబొట్లు(టాటూలు) అయి ఉంటాయని విరాట్ సరదాగా అన్నాడు.
ఇక ఈ సీజన్‌లో తాను, డుప్లెసిస్ కలిసి దాదాపు 900 పరుగులు చేశామని, గతంలో డివిలియర్స్‌తో కలిసి ఎలాగైతే ఆడానో ఇప్పుడు డుప్లెసిస్‌తో కలిసి అలాగే ఆడుతున్నట్లు కోహ్లి తెలిపాడు. ‘మ్యాచ్‌లో ఏం జరుగుతుంది తరువాత ఏం చేయాలనే దానిపై ఇద్దరికి అవగాహన ఉండాలి. అప్పుడే భాగస్వామ్యాలు సాధ్యం అవుతాయి. అంతర్జాతీయ స్థాయి అనుభవమున్న కెప్టెన్ ఉండడం మాకు(బెంగళూరుకు) కలిసి వస్తోంది. అని కోహ్లి అన్నాడు.
Virat Kohli: 18 నంబర్‌కు నాకు ఏదో రాసి పెట్టి ఉంది : విరాట్ కోహ్లి
హైదరాబాద్ అభిమానుల గురించి
ఉప్పల్‌లో ఆర్‌సీబీకి ప్రేక్షకుల మద్దతు గురించి మాట్లాడుతూ.. ఇది సొంత మైదానంలాగే అనిపించినట్లు కోహ్లి తెలిపాడు. ఇదే విషయాన్ని ఫాఫ్ కి కూడా చెప్పాను. జనాలు నా పేరును పదే పదే పలుకుతూ ఉత్సాహపరుస్తుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. దీన్ని కావాలని మనం సృష్టించలేము. ప్రజల మనస్సుల్లోంచి రావాల్సిందే. ఇక నేను మైదానంలో ప్రతిదీ నిజాయితీగా చేస్తాను. అందుకే ఇంత మంది అభిమానులను మనస్సులో స్థానం దక్కిందని అనుకుంటున్నాను అని కోహ్లి అన్నాడు.