YS Sharmila: తన మనవడు ఏం తింటడో రంగయ్య మనవడూ అదే తినాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?: షర్మిల

రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల సొమ్ముతో వందల కార్లతో పక్క రాష్ట్రాల్లో సభలు పెడతారని విమర్శించారు.

YS Sharmila: తన మనవడు ఏం తింటడో రంగయ్య మనవడూ అదే తినాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?: షర్మిల

YS Sharmila

YS Sharmila – KCR: ” నా మనవడు ఏం తింటడో రంగయ్య మనవడు అదే తినాలి ” అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మరి ఇప్పుడు కనీసం పాఠశాలల్లో విద్యార్థులకు తిండి దొరకకుండాపోతుంటే ఏం చేస్తున్నారని వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. విద్యార్థులు తిండిలేక ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ పై ఆమె విమర్శలు గుప్పించారు.

” పేద విద్యార్థుల కడుపులు ఎండబెడుతున్నడు. పంచభక్ష్య పరమాన్నాలు దొర తింటుంటే.. కనీసం పచ్చడి మెతుకులు కూడా పాఠశాలల్లో దిక్కులేదు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు, బ్రెడ్డు, పప్పు, పాయసంతో కొత్త మెనూ అంటూ ఉదరగొట్టి, దొర గారు మాటలతో కడుపులు నింపిండే తప్పా..కార్యాచరణకు నోచుకోలేదు.

మీ రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల సొమ్ముతో వందల కార్లతో పక్క రాష్ట్రాల్లో సభలు పెడతారు. కార్యకర్తలకు విందు భోజనాలు పెడతారు. దొర రాజకీయాలకు, జల్సాలకు నిధులు ఉంటాయి కానీ.. పేద పిల్లల మధ్యాహ్న భోజన కష్టాలు తీర్చడానికి మాత్రం చేతులు రావు. విద్యార్థులు ఓటర్లు కాదని కేసీఅర్ కు చిన్న చూపు.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు దాటినా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పూర్తి స్థాయిలో అందడం లేదు. పెట్టే బోజనానికి, సర్కారు ఇచ్చే నిధులకు పొంతన లేదని వంట కార్మికులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. కోట్ల రూపాయల్లో పేరుకు పోయిన గత ఏడాది బిల్లులు చెల్లింపు మాటలకే పరిమితం అంటే విద్యార్థుల పట్ల దొరకున్న శ్రద్ధ ఏంటో కనిపిస్తోంది.

కడుపు నిండా కమ్మని భోజనం పెడితే కమీషన్లు రావని పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా మేలుకుని వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. మాట ఇచ్చినట్లు కొత్త మెనూ ప్రకారం చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలి ” అని షర్మిల డిమాండ్ చేశారు.

Karumuri Nageshwara Rao : అది తెలిస్తే చంద్రబాబు గుండె ఆగిపోతుంది : మంత్రి కారుమూరి