తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కేరళ…ఉద్యోగులకు ప్రతినెలలో 6రోజుల జీతం కట్

వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే  కేరళ...ఇప్పుడు కరోనా విలయం, లాక్‌డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కేరళ…ఉద్యోగులకు ప్రతినెలలో 6రోజుల జీతం కట్

వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే  కేరళ…ఇప్పుడు కరోనా విలయం, లాక్‌డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప్రిల్-25,2020) ఆందోళన వెలిబుచ్చారు.  లాక్ డౌన్ కు నెల రోజులు పూర్తైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. కేంద్రం ఇచ్చేదానిని చేర్చినట్లయితే, రాష్ట్ర ఖజానా రూ .2,000 కోట్లకు చేరుతుంది.

జీతాల చెల్లింపు కోసం  తమకు 2,500 కోట్ల రూపాయలు అవసరమని థామస్ తెలిపారు. ప్రస్తుత పరిస్తితుల్లో ట్రెజరీని మూసివేయాల్సిన పరిస్థితి రానుందని, ఈ నేపథ్యంలోనే ఒక నెల జీతం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ అభ్యర్థించామన్నారు. ఈ నిధులను సిఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్‌ తరలించి బాధితుల అవసరాలకు వినియోగించాలన్న ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ సహా  వివిధ సిబ్బంది సంస్థలు  వ్యతిరేకించడంతో  ఈ విషయంలో ముందుకు పోలేకపోతున్నామని, 5నెలల పాటు… ప్రతి నెలలో ఆరు రోజుల జీతం కోత విధింపునకు నిర్ణయించామన్నారు.

వచ్చే నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం సమయంలో ఇదే  ఏకైక మార్గంగా భావించామని, ఈ డబ్బును తిరిగి చెల్లిస్తామని ఆయన చెప్పారు. రాష్ర్ట మంత్రివ‌ర్గం ఆమోదం లభించిన ఈ నిర్ణయం ప్ర‌కారం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర అనుబంధ పరిశ్రమలు,యూనివర్శిటీలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల నెల జీతంనుంచి  6 రోజుల జీతం కోత అయిదు నెలలపాటు వుంటుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్ర‌క‌టించారు. కాగా,భారత్ లో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో ఇప్పుడు కరోనా కంట్రోల్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో కేరళ తీసుకున్న చర్యలపై కేంద్రప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది.