ఇక కాస్కో : 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ పోటీ..కేజ్రీవాల్

ఇక కాస్కో : 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ పోటీ..కేజ్రీవాల్

Kejriwal ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర పార్టీలకు కాస్కోండి అంటూ సవాల్‌ విసిరింది. ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గురువారం(జనవరి-28,2021) కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ పోటీ చేస్తుందని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిదవ జాతీయ కౌన్సిల్ సమావేశం సమయంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

ఇతర పార్టీలకు ఎలాంటి దూరదృష్టి లేదని..అందుకే వాళ్లు గతం గురించి మాట్లుడుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే భవిష్యత్ గురించి మాట్లాడుతోందని..21వ,22వ శతాబ్దాల విజన్ ఆప్ కి ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచించారు. చాలా పెద్ద స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. తమకు దేశం ముఖ్యమని..ఆప్ ఓ వాహనం అని..పార్టీ డెవలప్మెంట్ కోసం కష్టపడాలని కేజ్రీవాల్ కార్యకర్తలను కోరారు.

ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. హింస‌కు పాల్ప‌డిన వారిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆ రోజు ఘ‌ట‌నలు క్ష‌మించ‌రానిద‌ని పేర్కొన్నారు. అయితే హింసాత్మకమైనా కానీ రైతుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విధ్వంసానికి కారణం ఏ పార్టీ అయినా, ఏ నేతయినా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. రైతుల ట్రాక్ట‌ర్ల‌ ఆందోళ‌నల‌‌తో సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం ఆగ‌లేద‌ని పేర్కొన్నారు. రైతుల‌కు అంద‌రం క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.