Olympic Equipment drop: ఒలింపిక్స్ ఆటగాళ్ల వస్తువుల వేలం.. బాగా తగ్గిపోయిన క్రేజ్!
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు వాడిన క్రీడా పరికరాలు వేలానికి పెట్టగా.. మొదట్లో అనూహ్యమైన స్పందన లభించింది.

Craze
Olympic Equipment drop: టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు వాడిన క్రీడా పరికరాలు వేలానికి పెట్టగా.. మొదట్లో అనూహ్యమైన స్పందన లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులను ఈ- వేలం వేశారు. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ అథ్లెట్లు మోడీని కలిసినపుడు వాళ్లు వాడిన క్రీడా వస్తువులను.. మోడీకి బహుమతికి అందించగా.. వాటికి వేలంలో భారీ ధర పలుకినట్లుగా కనిపించింది.
మొదట్లో ఫెన్సర్ భవానీ దేవి కత్తి బిడ్ ధర రూ.10 కోట్లు దాటగా.. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచిన కృష్ణ నాగర్, రజతం గెలిచిన సుహాస్ రాకెట్ల బిడ్ కూడా రూ.10 కోట్లకు చేరింది. నీరజ్ చోప్రా ఈటె కూడా మొదటి వారం వేలంలో రూ.10 కోట్లు పలికింది. పీవీ సింధు రాకెట్ బిడ్ రూ.9కోట్ల బిడ్ దాటింది. బాక్సర్ లవ్లీనా గ్లౌవ్స్‌కు కూడా భారీ బిడ్ వేశారు.
అయితే, మొదటివారం భారీ బిడ్లు వేయగా.. ఇప్పుడు వేలంలో రూ.80 లక్షల నుంచి రూ.కోటికి పడిపోయాయి. మొత్తం 1330 జ్ఞాపికలను pmmementos.gov.in అనే వెబ్సైట్లో వేలం వేయగా.. అందులో కొన్ని బిడ్లు నకిలీవి అని తేలడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ అధికారులు వాటిపై అనర్హత వేటు వేశారు. తర్వాత వాటి ధరలు భారీగా తగ్గిపోయాయి.
నీరజ్ చోప్రా ఈటె ధర కూడా రూ.5 కోట్లకు పడిపోయింది. అలాగే షట్లర్ పివి సింధు ఉపయోగించిన బ్యాడ్మింటన్ రాకెట్ మరియు బ్యాగ్ కోసం అత్యధిక బిడ్ సెప్టెంబర్ 18 న రూ .9 కోట్లు పలకగా.. బుధవారం రూ.91లక్షలకు పడిపోయింది. కాంస్య పతక విజేత లవ్లీనా బాక్సింగ్ గ్లోవ్స్ రూ.80 లక్షలకు పడిపోయింది. అక్టోబరు 7న వేలంపాట ముగియనుండగా.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతికశాఖ కోరుతుంది. ఈ-వేలం ద్వారా వచ్చే మొత్తం గంగానది పరిరక్షణ మరియు పునరుజ్జీవనం లక్ష్యంగా నమామి గంగే మిషన్‌లో ఖర్చుపెట్టనున్నారు.