OPS-EPS : అన్నాడీఎంకే చీఫ్ లుగా ఎన్నికైన ఓపీఎస్-ఈపీఎస్..చిన్నమ్మకు కష్టాలే!

అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని చూస్తోన్న చిన్నమ్మ "శశికళ"కు గట్టి ఎదురెదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్​ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి

OPS-EPS : అన్నాడీఎంకే చీఫ్ లుగా ఎన్నికైన ఓపీఎస్-ఈపీఎస్..చిన్నమ్మకు కష్టాలే!

Ops Eps

AIADMK Party :  అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని చూస్తోన్న చిన్నమ్మ “శశికళ”కు గట్టి ఎదురెదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్​ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్​ 4న వీరు నామినేషన్లు సమర్పించగా.. పోటీ లేకుండానే విజయం సాధించినట్లు సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీ పొన్నయన్‌ ప్రకటించారు.

కాగా, పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఇద్దరూ తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కన్వీనర్‌, జాయింట్ కన్వీనర్లుగా ఎన్నికైన అనంతరం ఓపీఎస్-ఈపీఎస్ ఇద్దరూ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌, దివంగత సీఎం జయలలిత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాగా, ఎన్నికలకు ముందు పార్టీ బైలాస్​ను సవరించి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్​, ఈపీఎస్​ సఫలమయ్యారు. అన్నాడీఎంకే పార్టీలో 2017లో తొలిసారిగా పార్టీ నిబంధనలను సవరించారు. జనరల్​ సెక్రటరీ స్థానాన్ని తొలగించి పార్టీ సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త స్థానాలకు అధికారాన్ని కల్పించారు. రెండు పదవులు ఉన్నా సమాన అధికారం ఉండేలా మార్పులు చేశారు. అయితే అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన శశికళను పదవిలో నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించారు.

ఆ తర్వాత అక్రమాస్తుల కేసుల్లో దోషిగా తేలిన ఆమె జైలు జీవితం గడిపారు. ఇటీవల జైలు నుంచి విడుదలై తమిళనాడు తిరిగొచ్చాక శశికళ మళ్లీ ప్రధాన కార్యదర్శినని చెప్పుకుంటూ అన్నాడీఎంకేలో తన స్థానాన్ని స్థిరపరుచుకోవాలని చూస్తోన్న సమయంలో ఆమెకు అన్ని దారులు మూసివేసేలా పార్టీ చర్యలు చేపట్టింది. కార్యనిర్వహక కమిటీ సభ్యులు ఇటీవల పార్టీ నిబంధనలలో కీలక మార్పులు చేశారు. పార్టీ సమన్వయకర్త, జాయింట్​ కోఆర్డినేటర్​ స్థానాలకు సింగిల్​ ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ బైలాస్​ను సవరించారు.

ALSO READ Chikmagalur School : కర్ణాటకలో స్కూల్ లో కరోనా కల్లోలం..101మంది విద్యార్ధులకు పాజిటివ్