Movie Theaters: థియేటర్లు మూయాల్సిందే.. లేకుంటే పెను ప్రమాదమే!

Movie Theaters: థియేటర్లు మూయాల్సిందే.. లేకుంటే పెను ప్రమాదమే!

Are Movie Theaters Safe During Covid 19

భారత్‌లో కరోనా విస్తరిస్తూ ఉండగా.. పరిస్థితులు గతంతో పోలిస్తే.. ఇంకా దారుణంగా అయ్యేట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడు ఓ లెక్క అన్నట్లుగా మహమ్మారి ప్రళయరూపం చూపిస్తోంది. ఈ క్రమంలో.. దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే థియేటర్లు, ఆడిటోరియాలు మూసివేయాల్సిందే అంటూ.. ప్రముఖ అంతర్జాతీయ వైద్యపత్రిక ‘లాన్సెట్‌’.. కొవిడ్‌ 19 కమిషన్‌ ఇండియాలో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ సూచించింది.

ఇండోర్‌ సమావేశాలపై కనీసం రెండు నెలల పాటు పూర్తిగా నిషేధం విధించాలని.. ప్రస్తుతం పెళ్లిళ్లు, పండుగలు గుంపులుగుంపులుగా చేసుకుంటున్నారని, మతపరమైన, సామాజిక కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, దేశంలో ప్రస్తుత పరిస్థితికి కారణం అని నివేదిక వెల్లడించింది. కుంభమేళా, ఎన్నికలు వైరస్‌ తీవ్రంగా వ్యాపించడానికి కారణం అయినట్లుగా నివేదిక చెప్పుకొచ్చింది.

రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని, ముందుగానే అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు చేసింది. లాక్‌డౌన్‌లో తీసుకున్నట్లుగా కఠిన చర్యలు అమలు చేస్తేనే పరిస్థితి అదుపులో ఉంటుదని హెచ్చరించింది. పది మంది గుమికూడకుండా రెండు నెలలుపాటు నిషేధం విధించాలని, లక్షల్లో కేసులు నమోదు అవుతున్నా.. జనాలు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారని, టెస్టింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌ విధానాన్ని సమర్థంగా కొనసాగిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నివేదిక చెబుతుంది.