రైల్వేస్టేషన్ లో అరటిపండ్లు అమ్మకాలపై నిషేధం

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 04:57 AM IST
రైల్వేస్టేషన్ లో అరటిపండ్లు అమ్మకాలపై నిషేధం

ఉత్తర ప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో అరటి పండ్లు అమ్మకూడదంటు అధికారులు ఆర్డర్ వేశారు. దీంతో అరటి పండ్ల వ్యాపారులతో పాటు ప్రయాణీకులు కూడా ఆశ్చర్యపోయారు.  అరటి పండ్ల అమ్మకాలపై నిషేధం విధించటంలో ప్రయాణీకులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 

ఆకలేస్తే రెండు అరటి పండ్లు కొనుక్కుని తింటే కడుపు నిండిపోతుంది. పేదలకు కూడా అందుబాటు ధరలో ఉంటాయి అరటిపండ్లు. ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు ఏవున్నా లేకున్నా దగ్గర అరటి పండ్లు ఉంటే ఆకలి సమస్యే ఉండదు. రైల్లే ప్లాట్ ఫామ్ లపై అరటి పండ్లు వ్యాపారులు అమ్ముతుంటారు. వాటిని ప్రయాణీకులు కొనుక్కోవటం అంతా సర్వసాధారణం. 

కానీ ఉత్తరప్రదేశ్ లక్నో నగర సమీపంలో ఉన్న చార్‌బాగ్ రైల్వేస్టేషన్ లో మాత్రం అరటి పండ్లు అమ్మటానికి వీల్లేదంటు అధికారులు ఆదేశించారు.  అరటిపండ్ల విక్రయ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డు కూడా పెట్టారు. దీంతో  అరటిపండ్ల వ్యాపారులు విస్తుపోయారు. అధికారులు తమ పొట్టకొడుతున్నారంటూ వాపోతున్నారు.  

చార్ బాగ్ రైల్వేస్టేషనులో అరటిపండ్ల విక్రయం వల్ల స్టేషను ప్లాట్ ఫాంలపై చెత్త పెరిగిపోతోందనీ..అందుకే అరటి పండ్ల అమ్మకాల్ని నిషేధించామని అధికారులంటున్నారు.  పేదలకు తక్కువ ధరలకు లభించే అరటిపండ్ల విక్రయాలను నిషేధించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పండ్ల వ్యాపారి ఆశిష్ కుమార్ చెప్పారు. అధికారుల ఆదేశాలతో..గత కొన్ని రోజుల నుంచీ తాను అరటిపండ్లు అమ్మటం లేదనీ..దీంతో తమకు చాలా నష్టం వాటిల్లిందనీ వాపోయాడు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని మరో వ్యాపారి తెలిపాడు.

అరటిపండ్ల అమ్మకాల వల్ల చెత్త పేరుకుపోతోందనే మాట నిజమైతే దానికి ప్రత్యామ్నాయం చూడాలి గానీ ఇటు చిరువ్యాపారులను..అటు ప్రయాణీకులను ఇబ్బంది పెట్టటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంటే వాటి వినియోగాన్ని నియంత్రించకపోగా..చిరువ్యాపారులపై ఇటువంటి ఆంక్షలేంటంటూ ప్రశ్నిస్తున్నారు అరటి పండ్ల వ్యాపారులు.