బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు : సీఏఏ అక్కర్లేదు…మోడీ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : January 19, 2020 / 03:32 PM IST
బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు :  సీఏఏ అక్కర్లేదు…మోడీ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు

పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నసమయంలో సీఏఏపై బంగ్లాదేశ్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బంగ్లాదేశ్ జనాభా16 కోట్లుకాగా, అందులో 10.7 శాతం మంది హిందువులేనని, వాళ్లంతా సురక్షితంగా ఉన్నారని, మతపరంగా వారిపై ఎలాంటి వేధింపులు జరగడంలేదని, అయినా భారత ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందో తమకు అర్థం కావట్లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా  ప్రఖ్యాత ‘గల్ఫ్ న్యూస్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నామంటూ బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆమె పరోక్షంగా సమర్థించారు.

సీఏఏ అవసరం లేదన్నది బంగ్లాదేశ్ ఉద్దేశమే అయినప్పటికీ.. అది భారతదేశ అంతర్గత వ్యవహారం కాబట్టి దీనిపై ఎలాంటి జోక్యం ఉండబోదని షేక్ హసీనా క్లారిటీ ఇచ్చారు. అయితే  భారత్ నుంచి బంగ్లాదేశ్ కు తిరుగువలసలు లేవని ఆమె స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్సార్సీ అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. గతేడాది భారత పర్యటన సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ చట్టాలతో బంగ్లాకు ఎలాంటి ఇబ్బందులుండవని మోడీ తనకు హామీ ఇచ్చారని హసీనా తెలిపారు.

బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా కంటే ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ సీఏఏపై స్పందిస్తూ.. భారత్ లో టెన్షన్ వాతావరణం నెలకొనడం ఆందోళనకరమని, ఆ ప్రభావం పొరుగుదేశాలపైనా ఉంటుందని అన్నారు. అయితే భారత్ కు సంబంధించి బంగ్లాదేశ్ ఎల్లప్పుడూ నంబర్ వన్ ఫ్రెండ్ గానే కొనసాగిందని, సీఏఏ, ఎన్సార్సీ  భారత అంతర్గత వ్యవహారలన్నారు.