కొత్త రాజకీయ పార్టీ లాంఛ్ చేసిన భీమ్ ఆర్మీ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2020 / 01:10 PM IST
కొత్త రాజకీయ పార్టీ లాంఛ్ చేసిన భీమ్ ఆర్మీ చీఫ్

దేశ రాజకీయాల్లోకి కొత్త పార్టీ వచ్చేసింది. కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం(మార్చి-15,2020)తన పార్టీ ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ని లాంఛ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ నోయిడా లోని బసయ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేసి తన పార్టీ పేరును ఆజాద్ ప్రకటించారు.

పార్టీ ప్రకటన సందర్భంగా పెద్ద ఎత్తున భీమ్ ఆర్మీ మద్దతుదారులు,కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ కోసం ఆజాద్ సమాజ్ పార్టీ, ఆజాద్ బహుజన్ పార్టీ, బహుజన్ అవామ్ పార్టీ అనే మూడు పేర్లు పరిశీలించగా.. చివరికి ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ పేరును ఖరారు చేశారు. పార్టీ పేరుని ప్రకటించిన అనంతరం ఆజాద్ ఓ ట్వీట్ చేశారు.

కాన్షీరామ్ సర్ మీ మిషన్ అసంపూర్తిగా ఉంది,ఆజాద్ సమజ్ పార్టీ దాన్ని పూర్తి చేస్తుంది అని ఆ ట్వీట్ లో తెలిపాడు. 2022ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార బీజేపీ,ఎస్పీ,బీఎస్పీల మధ్య ఫైట్ నడుస్తున్న సమయంలో ఆజాద్ సమాజ్ పార్టీ ఎంట్రీ ఆశక్తిగా మారనుంది.