కేజ్రీవాల్ పై 40మంది స్టార్ క్యాంపెయినర్లను దించిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 22, 2020 / 03:10 PM IST
కేజ్రీవాల్ పై 40మంది స్టార్ క్యాంపెయినర్లను దించిన బీజేపీ

వచ్చే నెలలో జరగనున్నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన్న కమలం పార్టీ 40మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతోంది. 2015నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ హవా ఉన్నప్పటికీ కేవలం 3సీట్లు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. రాబోయే 15 రోజుల్లో పలువురు కేంద్రమంత్రులు,ఎంపీలు,పలు రాష్ట్రాల సీఎంలు,మాజీ సీఎంల చేత ఢిల్లీలో ప్రచారం చేయించనుంది కమలం పార్టీ.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు…అమిత్ షా, స్మృతీ ఇరానీ,విజయ్ గోయెల్, హర్షవర్థన్,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కరీ,ప్రకాష్ జావదేకర్,గజేంద్రసింగ్ షెకావత్,అనురాగ్ ఠాకూర్ లు కూడా ఉన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్,హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ లు కూడా స్టార్ క్యాంపెయినర్ ల జాబితాలో ఉన్నారు. సెలబ్రిటీ ఎంపీలు గౌతమ్ గంభీర్, హేమామాలినీ,సన్నీ డియోల్,రవికిషన్ లు కూడా లిస్ట్ లో ఉన్నారు. అయితే చాలామంది క్యాంపెయినర్లు ఢిల్లీకి చెందినవారు కాకపోవడం విశేషం. మరి వీళ్లతో ఢిల్లీలో ఎలా ప్రచారం చేయించి బీజేపీ జెండాను దేశరాజధానిలో ఎగురవేస్తుందో చూడాలి. 

అయితే బీజేపీ ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడాన్నిఆప్ పార్టీ పదే పదే ప్రజల వద్ద ప్రస్తావిస్తోంది. బీజేపీకి సీఎం అభ్యర్థే లేదని,బీజేపీ 7గురు సీఎం అభ్యర్థులు అంటూ సెటైర్లు వేస్తోంది ఆప్. ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కు నాయకత్వ లేమి గట్టిగా కన్పిస్తోంది.