స్విస్ ఖాతాదారుల వివరాలు చెప్పం…కేంద్ర ఆర్థికశాఖ

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 03:18 PM IST
స్విస్ ఖాతాదారుల వివరాలు చెప్పం…కేంద్ర ఆర్థికశాఖ

స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు బయటపెట్టలేమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు  సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఇలా స్పష్టం చేసింది. భారత్‌,  స్విట్జర్లాండ్‌ మధ్య ఉ‍న్న ఒప్పందాల మేరకు ఈ వివరాలను అందించలేమని తెలిపింది. 

అలాగే ఇతర విదేశీ దేశాలనుంచి వచ్చిన నల్లధనం వివరాలను వెల్లడించడానికి కూడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. గోప్యతా నిబంధనలపై స్విట్జర్లాండుతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని చెప్పింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉందని తెలిపింది. పన్ను సంబంధిత సమాచారం, విదేశీ ప్రభుత్వాల నుండి పొందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమని సృష్టం చేసింది.

డిసెంబర్ 2017 లో, భారతదేశం, స్విట్జర్లాండ్ దేశాలు పన్ను విషయాలలో మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ అనే బహుళపక్ష ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది రెండు దేశాలకు ఆర్థిక డేటాను  మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబరులో, స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి మొదటి స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు లభించిన విషయం తెలిసిందే. మే నెలలో కూడా స్విట్జర్లాండ్ నుంచి అందుకున్న నల్లధనం కేసులపై సమాచారం ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. గతేడాది స్విస్ బ్యాంక్ తెలిపిన రిపోర్ట్ ప్రకారం…స్విస్ బ్యాంకులో భారతీయుల నల్లధనం 50శాతం పెరిగింది.