రూ.10వేల కోట్లు ఖర్చుతో 30 కోట్ల మంది భారతీయులకు తొలి కరోనా టీకా..

రూ.10వేల కోట్లు ఖర్చుతో 30 కోట్ల మంది భారతీయులకు తొలి కరోనా టీకా..

30 crore Indians on priority list in first phase : ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. Covid-19 వ్యాక్సిన్ కోసం భారతీయులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇండియాలో కూడా అతి త్వరలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడమే ఆలస్యం.. పంపిణీకి సన్నద్ధమవుతోంది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలి దశలో భాగంగా 30 కోట్లమంది భారతీయుల్లో ప్రాధాన్యత గ్రూపులకు అందించనుంది.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా కేంద్రం టీకా కోసం భారీ మొత్తంలో నిధులను కేటాయించనుంది.

అయితే ముందుగా బీహార్, కేరళ రాష్ట్రాలకు మాత్రం కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా అందించనుంది. మరికొన్ని రాష్టాల్లో కూడా కేంద్రం నుంచి అతి త్వరలో ఇలాంటి ప్రకటనే వచ్చే అవకాశం ఉంది.

దేశ జనాభాలో 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునేందుకు సిద్ధంగా లేదని సంబంధింత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే భారత్.. కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్లాన్‌కు మద్దతు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), GAVI నేతృత్వంలో ఈ ఒప్పందం అమలు కానుంది.

ఇందులో భాగంగా కోవిడ్-19 టూల్స్ (ACT) యాక్సలేటర్ కింద పేద దేశాలకు మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు అవసరమైన నిధులను WHO సమకూర్చనుంది. గత ఏప్రిల్ నెలలో ఈ ఒప్పందానికి భారత్ కూడా మద్దతునిచ్చింది. ప్రస్తుతం GAVI .. దేశంలో వ్యాక్సినేషన్ కు అయ్యే ఖర్చుకు సంబంధించి సాయం చేసేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ లో ముందుగా కొన్ని గ్రూపులను నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూపు ఆన్ వాక్సిన్స్ (NEGVAC) మొదటి ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. మొత్తంగా ఒక కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు ఉండగా వారిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. అలాగే 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్, నిత్యావసరాల కోసం పనిచేసిన వర్కర్లు, 50ఏళ్లు పైబడిన వృద్ధులు, కోమోర్బోటీలు, డయాబెటిస్, గుండెజబ్బులు, లివర్ అలైన్ మెంట్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో 27 కోట్లమంది ఉన్నారు. మొత్తంగా 30 కోట్ల మంది జనాభాకు కరోనా టీకా సరిపోయేంతగా కేంద్రం చర్యలు చేపడుతోంది.

మరోవైపు.. భారతదేశంలో మూడు కరోనా వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఫైజర్, భారత్ బయోటెక్, సీరమ్ (SII) ఈ మూడు వ్యాక్సిన్ల మోతాదులను డెవలప్ చేశాయి. తొలి దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ముందుగా ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా, సీరమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Covishield వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితమో నిర్ధారించాల్సి ఉంది. ఆ తర్వాతే దేశంలో కరోనా తొలి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.