మళ్లీ లాక్ డౌన్, కేవలం వాటికి మాత్రమే అనుమతి

కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.

మళ్లీ లాక్ డౌన్, కేవలం వాటికి మాత్రమే అనుమతి

nagpur

Complete lockdown : కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు నమోదువుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భారతదేశంలో కూడా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. పలు ఆంక్షలు, కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కరోనాకు చెక్ పెట్టేందుకు కొన్ని నగరాల్లో ఆంక్షలు విధిస్తున్నారు.

నాగ్ పూర్ లో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2021 మార్చి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు తాజాగా..అధికారులు ప్రకటించారు. కేవలం నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే తెరిచి ఉంటాయని అధికారులు వెల్లడించారు. రాత్ర 9 గంటల తర్వాత నిత్యావసర సరకులు విక్రయించే దుకాణాల మూసివేయాల్సి ఉంటుందన్నారు.

మిగతావన్నీ మూసి వేయాల్సిందేనని, నిత్యావసర సరకులు అమ్మే షాపులు మినహా ఇతర దుకాణాలన్నీ సాయంత్రం 7 తర్వాత మూసివేయాలని సూచించారు. వారంలో ఆరు రోజులు మాత్రమే షాపులు తీయాలని, శనివారం లేదా ఆదివారం ఏదో ఒక్క రోజు తప్పని సరిగా షాపులు మూసివేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్ విషయంలో మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది. నాగ్ పూర్ లో బుధవారం ఏకంగా 1710 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.

ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. థానే, నాసిక్‌లోని 16 హాట్‌స్పాట్లలో కోవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది అధికారయంత్రాంగం. అయితే నాగ్‌పూర్‌లో గతేడాది మార్చి, ఏప్రిల్‌లో మాదిరి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలుచేయనుండడం చర్చనీయాంశమవుతోంది.

దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల్లో 60 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ముంబై, పూణె, థారావిలోనూ ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులో 54 మంది మరణించారు. ఒక్క రోజులో 13 వేల 659 కేసులు వెలుగుచూశాయక్కడ. అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడంతో సర్కార్‌ కఠినచర్యలు తీసుకోనుంది. మరిన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలుకు ప్లాన్‌ చేస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ థాక్రే ప్రకటన చేశారు. పరిస్థితి ఇలానే ఉంటే…మరిన్ని నగరాలు, పట్టణాల్లో లాక్‌డౌన్‌ విధిస్తామని హెచ్చరించారు.