కాంగ్రెస్ లో ఇన్ సైడ్ ఫైటింగ్ : మోడీని పొగడటం ఆపి పార్టీ కోసం పనిచేయాలని సీనియర్ నేతలకు అధిర్ సూచన

కాంగ్రెస్ లో ఇన్ సైడ్ ఫైటింగ్ : మోడీని పొగడటం ఆపి పార్టీ కోసం పనిచేయాలని సీనియర్ నేతలకు అధిర్ సూచన

Congress కాంగ్రెస్ పార్టీలో కొత్త కీచులాటలపర్వం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బయటపడి పార్టీని మళ్ళీ రచ్ఛకీడ్చింది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23)తిరుగుబాటు నేతలు ఇటీవల జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం..ఇప్పుడు అసోం,బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి అధినాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోండటంతో పార్టీలో మళ్లీ అంతర్గత రచ్చ మొదలైంది. బెంగాల్ లో పొత్తుల విషయంపై లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత మరియు బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అయిన అధిర్ రంజన్ చౌదరి, అసమ్మతి సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో…ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ISF) తో పొత్తు పెట్టుకోవాలన్న అధిర్ రంజన్ నిర్ణయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తప్పు పట్టారు. ఇలాంటి పార్టీల‌తో పొత్తు లౌకిక‌వాద గాంధీ, నెహ్రూల కాంగ్రెస్ సిద్ధాంతాల‌కు పూర్తి విరుద్ధ‌మ‌ని ఆనంద్ శ‌ర్మ ట్వీట్ చేశారు. ISFమతతత్వ పార్టీ అని, దానితో పొత్తేమిటని ఆయన ప్రశ్నించారు. ఓ వైపు మత తత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీని ఎదుర్కోవాలని మనం భావిస్తుంటే ఇదే పోకడ గల మరో సంస్థతో చేతులు కలుపుతారా అని సోమవారం ఆనందర్ శర్మ ఓ ట్వీట్ చేశారు.

ఆనంద్ శర్మ వ్యాఖ్యలపై అధిర్ రంజ‌న్ చౌద‌రీ ఘాటుగా స్పందించారు. నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. ఈ పేరున్న గొప్ప నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనబెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఇటీవల మోడీ పొగిడిన G-23బాస్ ఆజాద్ సహా ఆనంద్ శర్మను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. తమకు ఇన్నేళ్ళుగా బాసటగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు. మోడీ వంటి నాయకులు ఉండడం మనకు గర్వ కారణమని ఆజాద్ అదేపనిగా ఆయనను ఆకాశానికెత్తేశారని..ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని,ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని అధిర్ విమ‌ర్శించారు.

ఆనంద్ శర్మ ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా త‌న‌కే కాల్ చేయాల్సింద‌ని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోందని. అందులో కాంగ్రెస్ ఓ భాగమని అధిర్ తెలిపారు. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. ఆనంద్ శర్మని మరియు జీ-23ని కోవర్ట్ నేతలుగా అభివర్ణించారు. ఈ నేతలు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించారని,ఇప్పుడు కాంగ్రెస్ చాలా నిరాడంబరమైన స్థితికి తగ్గించబడినందున…తమకు ఆఫర్ చేయడానికి కాంగ్రెస్ దగ్గర వనరులు లేవని వారు భావిస్తున్నారని..అందుకే వారు కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నారని ఇవాళ ఓ ఇంటర్వ్యూలో అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇక, బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ..92 సీట్లకు పోటీ చేస్తుందని అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు. సీట్ల పంపిణీని తమ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఖరారు చేశాయని, తమ అభ్యర్థుల పేర్లను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.