కాంగ్రెస్ లో భారీ మార్పులు, ఆజాద్ అవుట్

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 08:01 AM IST
కాంగ్రెస్ లో భారీ మార్పులు, ఆజాద్ అవుట్

వర్కింగ్‌ కమిటీలోనూ.. కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వం భారీగా మార్పులు చేసింది. రాహుల్‌ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించింది. రానున్న కాలంలో రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింది. అన్నింటి కంటే ముఖ్యంగా.. అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నాయకుడు, గులాం నబీ ఆజాద్‌పై పార్టీ హైకమాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది.



సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. కాంగ్రెస్‌ పార్టీలో సమగ్ర సంస్కరణలు, కిందిస్థాయి నుంచి ఎన్నికలు కోరుతూ లేఖ రాసిన 23 మందిలో గులాంనబీయే కీలకనేత. ఆ అంశాన్ని వర్కింగ్‌ కమిటీలో లేవదీసింది కూడా ఆజాదే. లేఖ రాసినందుకు తనకెవరిపైనా శత్రుత్వం, ద్వేషం లేదని చెప్పిన సోనియగాంధీ.. చివరికి ఆజాద్‌ను పదవీచ్యుతుడిని చేసింది.
https://10tv.in/governments-unpreparedness-alarming-rahul-gandhi-on-vaccine-strategy/
ఆజాద్‌తో పాటు లేఖపై సంతకాలు చేసిన జితిన్‌ ప్రసాద, ముకుల్‌ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించారు. లేఖ రాసినందుకు క్షమాపణ చెప్పిన ముకుల్‌ వాస్నిక్‌ను సోనియాకు సహాయపడే ప్రత్యేక కమిటీలో చేర్చారు. ఇక జితిన్‌ ప్రసాదను ఉత్తరప్రదేశ్‌ నుంచి తప్పించి- త్వరలో ఎన్నికలకు వెళుతున్న బెంగాల్‌కు ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎన్నికలు జరిపి సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని అసమ్మతి బృందం డిమాండ్‌ చేయగా అందుకు భిన్నంగా తాత్కాలిక ఇన్‌ఛార్జి హోదాలోనే కమిటీని ప్రక్షాళన చేయడం.. అందులోనూ విధేయులకు పెద్దపీట వేయడం చర్చనీయాంశంగా మారింది.



కాంగ్రెస్‌ నాయకత్వం ఏఐసిసిలో భారీ మార్పులు చేర్పులు ప్రకటించింది. ఆజాద్‌ మాదిరే ఎన్నో ఏళ్లుగా వివిధ రాష్ట్రాల బాధ్యతలను చేపట్టిన మోతీలాల్‌ వోరా, అంబికా సోనీ, లుజినో ఫెలేరో, మల్లిఖార్జున ఖర్గే లాంటి వారిని ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించింది. వీరంతా గాంధీ కుటుంబానికి వీరవిధేయులు. గులాంనబీని తొలగించడంపై విమర్శలు రాకుండా ఈ సీనియర్లను కూడా బయటకు పంపి- కొత్త వారికి అవకాశం కల్పించారు.

ఇక వర్కింగ్‌ కమిటీలోకి పి. చిదంబరం, తారిఖ్‌ అన్వర్‌, రణదీప్‌ సూర్జేవాలా, జితేంద్రసింగ్‌లను రెగ్యులర్‌ సభ్యులుగా నియమించారు. ఇప్పటిదాకా సీడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న ఫెలీరో, వోరా, అధీర్‌ రంజన్‌ చౌదరి, తమరధ్వజ సాహూల స్థానంలోనే వీరుంటారు. ఇంతవరకూ చిదంబరం, సూర్జేవాలా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు.



మార్పుల్లో అధినాయకత్వానికి అమిత విధేయుడు, పార్టీ ప్రతినిధి అయిన రణదీప్‌ సూర్జేవాలా భారీగా లబ్ధిపొందారు. ఆయనకు పదోన్నతిని కల్పించింది. అంతేకాదు.. ప్రధాన కార్యదర్శిగా నియమించి… కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలనూ అప్పగించింది. రాహుల్‌ కోటరీలో నెంబర్‌ వన్‌ వ్యక్తి అయిన సూర్జేవాలా. కాంగ్రెస్‌ పార్టీ వాణిని సమర్థంగా వినిపిస్తున్నందుకు ఈ ప్రమోషన్‌ కల్పించారని చెబుతున్నారు.

వర్కింగ్‌ కమిటీలో రెగ్యులర్‌ సభ్యుడుగా కూడా పదోన్నతి పొందిన ఆయన సంస్థాగత వ్యవహారాలకు సంబంధించిన అనేక కమిటీల్లో కూడాసభ్యుడు. ఇక మరో సభ్యుడు జితేంద్రసింగ్‌కు అసోం బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న ఒడిషా నేత రామచంద్ర ఖుంటియాను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్‌కు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు.



ఖుంటియా పార్టీ వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర సీనియర్‌ నేతలు అనేక మంది గతంలో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్వాసన ఊహించనదేనని అంటున్నారు. ఇక కొత్త ఇన్‌చార్జి ఠాగూర్‌.. రాహుల్‌ గాంధీకి విధేయుడు. తమిళనాడులోని విరుధనగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయనను.. తమిళనాట కీలకనేతగా మార్చేందుకు రాహుల్‌ ప్రోత్సహిస్తున్నట్లు వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీనే సోనియా కొనసాగించారు. అసమ్మతి లేఖపై సంతకం చేసిన మరికొందరు ప్రముఖులకు కూడా ఏఐసీసీలో , వర్కింగ్‌ కమిటీలో ఎలాంటి స్థానమూ దక్కలేదు. వీరిలో శశి థరూర్‌, మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ ఉన్నారు. రాజస్థాన్‌లో తిరుగుబాటు బావుటా ఎగరేసి రాహుల్‌-ప్రియాంకల చొరవతో కాంగ్రెస్‌లోనే ఉండిపోయిన సచిన్‌ పైలట్‌కూ ఎలాంటి స్థానం ఇవ్వలేదు. అయితే ఆయన జాతీయ రాజకీయాలకు రావడానికి విముఖంగా ఉన్నట్లు వినిపిస్తోంది.