Coronavirus New Symptoms : కరోనా కొత్త లక్షణాలు.. ఇవి కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి

గతంలో కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు. కానీ, ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.

Coronavirus New Symptoms : కరోనా కొత్త లక్షణాలు.. ఇవి కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి

Coronavirus New Symptoms

Coronavirus New Symptoms : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు తక్కువగానే ఉన్నా ఈసారి కరోనా వల్ల ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు:
కాగా, సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు తేల్చారు. గతంలో కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు. కానీ, ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త:
వైరస్‌ సోకిన వారిలో జీర్ణాశయ సమస్యలు(gastrointestinal problems), పొత్తి కడుపులో నొప్పి, కీళ్లనొప్పులు(Arthritis), కండరాల నొప్పులు(
Muscle aches), నీరసం, ఆకలి లేకపోవడం, వికారం(nausea), వాంతులు(vomting) ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటోందని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఈ లక్షణాలు కనిపించిన వారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని నిపుణులు గమనించారు. అటు.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం.

పెరిగిన ఇన్ ఫెక్షన్ తీవ్రత:
బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ వేరియంట్ల వల్ల, వైరస్ లో జరుగుతున్న ఉత్పరివర్తనాల వల్ల ఇన్ఫెక్షన్‌ తీవ్రత బాగా పెరుగుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. వైరస్‌ మరింత శక్తిమంతంగా మారి సోకినవారిలో కొత్త లక్షణాలకు కారణమవుతోందని, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తోందని వివరించారు.

సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా వ్యాప్తి:
మొదటి వేవ్‌లో కరోనా సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించ లేదు. కొందరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రం కనిపించాయి. అతి తక్కువ మందికి సీరియస్‌ అయినా బతికి బయటపడ్డారు. ప్రాణాలు కోల్పోయినవారు తక్కువే. కానీ సెకండ్‌ వేవ్‌లో కరోనా మరింత ఉధృతంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 50 వేల నుంచి 97వేలకు చేరడానికి నిరుడు కొన్ని నెలలు పడితే ఈసారి రోజువారీ కేసుల సంఖ్య కొన్ని రోజుల్లోనే లక్ష దాటేయడమే ఇందుకు నిదర్శనం.

బీపీ, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్త:
బీపీ, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే.. సమర్థమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉండడం వల్ల మరణాల సంఖ్య మాత్రం మొదటి వేవ్‌తో పోలిస్తే సగమే. ఆస్పత్రుల పాలయ్యేవారి సంఖ్య మరింత పెరిగితే వైద్య వ్యవస్థలన్నీ కుప్పకూలే ముప్పు ఉందని నిపుణులు అంటున్నారు.

సెకండ్ వేవ్ లో వైరల్ లోడ్ ఎక్కువ:
గతేడాది(2020) చివరి నుంచి చాలామంది మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఫలితంగా కేసుల సంఖ్య కిందటి ఏడాది నాటి పతాకస్థాయిని దాటింది. ఈసారి వైరస్‌ సోకినవారిలో వైరల్‌లోడ్‌ ఎక్కువగా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. వైరల్‌ లోడ్‌ ఎంత ఎక్కువ ఉంటే వారి నుంచి ఇతరులకు సోకే ముప్పు అంత ఎక్కువ. కాగా, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురి మెదడులో రక్తం గడ్డ కట్టిన దుష్ప్రభావానికి టీకాతో సంబంధం ఉండొచ్చని యూరప్ ఔషధ ఏజెన్సీ, వ్యాక్సిన్‌ అధ్యయన బృంద సారథి మార్కో కవలెరీ అభిప్రాయపడ్డారు.

కరోనా వ్యాప్తి కట్టడికి మాస్క్‌, వెంటిలేషన్‌ ముఖ్యం:
చిన్నసైజు గదుల్లో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే.. భౌతిక దూరం కంటే మాస్కులు ధరించడం, వెంటిలేషన్‌ ముఖ్యమని అమెరికా పరిశోధకులు తేల్చారు.