ఏపీ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలలో జాప్యం

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 02:23 PM IST
ఏపీ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలలో జాప్యం

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి గత ఏడాది డిసెంబర్‌ వరకు 1,400 కోట్ల రూపాయలు రావలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో తాము చెల్లించలేమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే అప్పుచేసి చెల్లింపులు చేస్తే,  తదుపరి బాకాయిలు తాము చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుచేసి ఉపాధిహామీ పథకం కూలీలకు చెల్లింపులు చేయాలని భావిస్తోంది.

క్యాబినెట్ సమావేశంలో సీఏం చంద్రబాబు అప్పులు చేసే మార్గంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కేంద్రం నుండి వచ్చే నిధులు 75 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాట 25 శాతం భరించాల్సి ఉంది. అప్పులు చేయడం సరే …. చేసిన అప్పుకు వడ్డీ ఎవరు చెల్లించాలనే ప్రశ్నకూడా ఈ సందర్భంగా ఉత్పన్నమౌతోంది. 14 వందల కోట్లకు వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని రోజుల్లో బకాయి చెల్లిస్తుందో స్పష్టం చేయలేదు. ఇటు వడ్డీ భారం ఎవరు భరిస్తారోననే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చకు రాలేదు. సీఎం చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్‌లో అప్పు చేయమని అధికారులకు సూచించారు. కానీ వడ్డీ భారం ఎవరు భరిస్తారో క్లారిటీ ఇవ్వలేదు.

గత 15 రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన మెటీరియల్ కాపోనెంట్ నిధులు 365 కోట్ల రూపాయలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడలేదు. వారం రోజుల్లో జరగాల్సిన పని రెండు వారాలు దాటినా జరుగలేదు. విడుదల చేసిన నిధులకే మోక్షం లేదు. గతంలో కేంద్రం లేబర్ కాంపొనెంట్ నిధులు చెల్లించకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడకూడదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే అప్పులు చేసి చెల్లించింది. ఆ నిధులు విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర ఆలస్యం చేసింది. మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి దాదాపు ఎనిమిది సార్లు తిరిగి ఎట్టికేలకు నిధులు విడుదల చేయించి అప్పులు తీర్చారు. అప్పట్లో అసలు మాత్రమే కేంద్రం ఇచ్చింది. వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. గత అనుభవం దృష్ట్యా అప్పులకు వెళ్లాలంటే అధికారులు భయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సమన్వయలోపంతో  ఉపాధి‌హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.