నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ…బీజేపీ బుల్లెట్లు దింపుతోందన్న యోగి

  • Published By: venkaiahnaidu ,Published On : February 2, 2020 / 09:48 AM IST
నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ…బీజేపీ బుల్లెట్లు దింపుతోందన్న యోగి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనలపై ఫైర్ అయ్యారు. ఆప్ ప్రభుత్వంపై యోగి తీవ్ర విమర్శలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో కొన్ని రోజుల నుంచి నిరసనలు చేస్తున్నవాళ్లకి కేజ్రీవాల్ సర్కార్…బిర్యానీలు సప్లై చేస్తుందని యోగి అన్నారు. 

ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ స్వచ్ఛమైన త్రాగునీరు కూడా అందించలేదని బీఐఎస్ సర్వే తెలిపిందన్నారు. ఢిల్లీ ప్రజలను ఆప్ సర్కార్ విషపునీరు తాగేలా చేస్తుందని ఫైర్ అయ్యారు. కానీ షాహీన్ బాగ్ సహా ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారికి కేజ్రీవాల్ సర్కార్ బిర్యానీలు సప్లై చేస్తుంని యోగి అన్నారు.

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రతిఒక్క టెర్రరిస్టును గుర్తించి వాళ్లకు బిర్యానీకి బదులుగా బుల్లెట్లను ఆహారంగా ఇస్తున్నామన్నారు. గతంలో పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకుని కొంతమంది పోలీసులు,భద్రతా బలగాలపై రాళ్లు విసిరేవారని,కశ్మీర్ లో పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేవారని అన్నారు. కేజ్రీవాల్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ వాళ్లకి మద్దతుగా నిలబడేవని యోగి విమర్శించారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత అదంతా ఆగిపోయిందని,అదే విధంగా మన సైనికుల చేతిలో పాక్ ఉగ్రవాదులు హతమవుతున్నారని యోగి తెలిపారు. కాంగ్రెస్,కేజ్రీవాల్ వాళ్లకి బిర్యానీ ఇచ్చేదని,కానీ బీజేపీ బుల్లెట్లను ఇచ్చిందని ఢిల్లీలో జరిగిన మరో ర్యాలీలో కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీలోని కరవాల్ నగర్,ఆదర్శ్ నగర్,నరీలా,రోహిణి ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ ఎక్కువగా మాట్లాడిన టాపిక్స్ బిర్యానీ,బుల్లెట్స్,పాకిస్తాన్. కేజ్రీవాల్ కు మెట్రో,రక్షిత మంచినీరు,ఎలక్ట్రిసిటీ అక్కర్లేదని,ఆయనకు షాహీన్ బాగ్ మాత్రమే కావాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మెట్రో,రోడ్లు కావాలా లేదా షాహీన్ బాగ్ కావాలా మీరు నిర్ణయించుకోండి అని ప్రజలకు యోగి సూచించారు. కేజ్రీవాల్ నిరసనకారులకు బిర్యానీ కోసం డబ్బులుయ ఖర్చుపెడుతున్నాడే తప్ప అభివృద్ధికి కాదని యోగి అన్నారు.