నా తల సిగ్గుతో వేలాడుతోంది : కంగనా రనౌత్

నా తల సిగ్గుతో వేలాడుతోంది : కంగనా రనౌత్

Kangana Ranaut దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ హింసాత్మకంగా మారడంపై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ స్పందించారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని బుధవారం కంగనా రనౌత్ ట్వీట్‌ చేసింది. ఢిల్లీ హింసపై బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి సౌరభ్‌ చౌదరి ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలను షేర్ చేసిన కంగనా…తన తల సిగ్గుతో వేలాడుతోందని అన్నారు. దేశ సమగ్రతను కాపాడలేకపోయామని..ఈ ఘటనలపై తీవ్రంగా కలత చెందానని, ఈరోజు తాను విఫలమయ్యానని కంగనా ట్వీట్‌ చేశారు. మరోవైపు రైతుల ఆందోళనలను సమర్ధించిన పంజాబీ నటుడు దిల్జిత్‌ దోసాంజ్‌తో ట్విటర్‌లో కంగనా రనౌత్‌ మాటల యుద్ధానికి దిగారు. రైతులుగా చెప్పుకుంటున్నవారికి మద్దతు ఇవ్వడం గర్హనీయమని కంగనా వ్యాఖ్యానించారు.

మరోవైపు,మంగళవారం ఓ వీడియోను ట్విట్టర్ లో కంగనా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కంగనా రనౌత్ మాట్లాడుతూ..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై ఎలా దాడి జరిగిందో చూశాం. అక్కడ నిరసనకారులు ఖలిస్థాన్ జెండాను ఎగురవేశారు. కరోనా మీద ఫైట్ చేసి బయటపడుతున్న అతికొద్ది దేశాల్లో మనం కూడా ఉన్నాం. వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా మన దేశంలోనే గాక ఇతర కంట్రీలకూ టీకాను అందిస్తున్నాం. ఒక సమయంలో కరోనా నుంచి మనం బయటపడగలమా అనే సందేహాలు నెలకొన్నాయి.

భారతీయులకు గతేడాది చాలా కఠినంగా, కష్టతరంగా సాగింది. కానీ ఎర్రకోట నుంచి అందుతున్న వార్తలు చాలా నిరాశను, కోపాన్ని తెప్పిస్తున్నాయి. రైతులుగా చెప్పుకునే కొందరికి కొన్ని శక్తుల నుంచి అందుతున్న ప్రోత్సాహం సరైంది కాదు. ఇదంతా దేశానికి, ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఇవాళ ప్రపంచం ముందు మనం ఫూల్స్‌లా నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దునియాలో మనకు పరువు లేకుండా చేసేశారు. ఇతర దేశాల ప్రధానులు వస్తే మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితికి ఇండియాను తీసుకొచ్చారు. ఈ దేశంలో ఇంకేం జరగదు. ఎవరైనా ఈ దేశాన్ని మంచి దిశగా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తే కొన్ని శక్తులు పది అడుగులు వెనక్కి గుంజేస్తున్నాయి. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న వారందరినీ జైళ్లలో వేయాలి. ఈ దేశ ప్రభుత్వం, సుప్రీం కోర్టు అంటే ఎవ్వరికీ లెక్క లేకుండా పోయిందని కంగన పేర్కొంది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీతో మంగళవారం “ఢిల్లీ” రణరంగాన్ని తలపించింది. బారికేడ్లను ధ్వంసం చేస్తూ సిటీలోకి రైతులు దూసుకురాగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగ్రహించిన రైతులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడులకు దిగారు. ఈ ఘటనలో 109 మందికి గాయాలయ్యాయి. అన్నదాతలపై పోలీసులు టియర్ గ్యాస్‌‌ను కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ ట్రాక్టర్ బోల్తా పడి ఒక రైతు మృతి చెందాడు. మంగళవారం రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి 200మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.