శశికళకు రజనీకాంత్ ఫోన్

శశికళకు రజనీకాంత్ ఫోన్

Rajinikanth ఏఐఏడీఎంకే బహిషృత నాయకురాలు వీకే శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. శశికళ ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినవారిలో మొదటివ్యక్తి రజనీకాంత్ అని మంగళవారం శశికళ మేనల్లుడు దినకరన్ వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు బెంగళూరు జైళ్లో శిక్ష అనుభవించిన శశికళ సోమవారం ఆమె చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే.

శశికళ మీద జనంలో ఏ మాత్రం అభిమానం తగ్గలేదని చెప్పడానికి సోమవారం ఆమెకు దక్కిన ఘనస్వాగతమే సాక్ష్యమని దినకరన్ చెప్పారు. శశికళ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా..లేదా అనే అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు దినకరన్ చెప్పారు. తమ ప్రధాన శత్రువు డీఎంకే అని, తాను AMMK పార్టీ పెట్టింది కేవలం అన్నాడీఎంకేను మళ్లీ కైవసం చేసుకుని రాష్ట్రంలో జయలలిత ‘అమ్మ’ ప్రభుత్వం తీసుకురావడానికేనని స్పష్టంచేశారు. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు చోట్ల పోటీచేస్తానని దినకరన్ చెప్పారు.

ఇక, చెన్నైలోని జయలలిత మెమోరియల్, అమ్మ స్మారక కేంద్రాన్ని మెయింటెనెన్స్ కోసం మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంపై దినకరన్ స్పందించారు. తాము అక్కడకు వెళ్తామన్న భయంతో వారు నిర్వహణ పేరుతో వాటిని మూసేశారని తాము వారిలా చేయబోమని (పన్నీర్ సెల్వం తిరిగి అన్నాడీఎంకేలో చేరడం) అన్నారు. కాగా, జైలుకు వెళ్లే ముందు శశికళ జయలలిత సమాధి వద్ద కొట్టి శపథం చేసిందనే ప్రచారం నేపథ్యంలో ఆమె జైలు నుంచి రిలీజ్ అవుతున్న వేళ అసలు ఆమె జయ సమాధి వద్దకు కూడా వెళ్లనివ్వకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక శశికళ చెన్నైలో అడుగుపెట్టిన గంటల్లోనే పళనిస్వామి ప్రభుత్వం ఆమెకు మరో గట్టి షాక్ ఇచ్చింది. వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రభుత్వం జప్తు చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును పళని స్వామి సర్కార్ ఇప్పుడు అమలు చేస్తోంది.

ఇదిలాఉంటే, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే వారుసురాలినని అంటూ సోమవారం శశికళ సంచలన ప్రకటన చేశారు. దాంతోపాటు అన్నాడీఎంకేలోని కోట్లాదిమంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో తమిళనాట పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది.