Mann Ki Baat : వ్యాక్సిన్ పై వదంతులు నమ్మొద్దు..రాష్ట్రాలకు అండగా కేంద్రం

కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Mann Ki Baat : వ్యాక్సిన్ పై వదంతులు నమ్మొద్దు..రాష్ట్రాలకు అండగా కేంద్రం

Mann Ki Baat

Modi కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం మన్​ కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా ఆలిండియా రేడియోలో మ‌ట్లాడిన ప్ర‌ధాని…కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్నప్పటికీ..రెండో దశ వైరస్ తుఫానులా వ్యాపిస్తోందని అన్నారు. కరోనా విషయంలో భయపడనవసరం లేదని అయితే అప్రమత్తంగా మెలగడం అత్యవసరమని అన్నారు. మ‌హమ్మారి కార‌ణంగా ఇటీవలి కాలంలో ఎందరో ఆప్తులను కోల్పోయామన్నారు. దేశంలో కరోనా బారిన పడినవారిలో అత్యధికులు వ్యాధి నుంచి కోలుకుంటున్నారని చెప్పారు.

కరోనా వ్యాప్తి నివారణకు ఫార్మా ప‌రిశ్ర‌మ‌, ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి రంగాల‌కు చెందిన ప‌లువురు నిపుణులతో సమావేశమై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. కరోనాపై ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు పెద్ద యుద్ధమే చేస్తున్నారని.. వారి సేవ చిరస్మరణీయమని అన్నారు. గ‌త ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంలో క‌రోనా మ‌హ‌మ్మారి వారికి ప‌లు విధాల అనుభ‌వాల‌ను మిగిల్చింద‌ని చెప్పారు. కరోనా విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా డాక్టర్లను సంప్రదించాలని ప్రజలకు ప్రధాని సూచించారు. అంబులెన్స్​ డ్రైవర్లకు మోడీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరులో డ్రైవర్ల సేవ అనిర్వచనీయమని ప్రశంసించారు.

రాయపూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో నర్సింగ్ సేవలు అందిస్తున్న సిస్టర్ భావనా ధృవ్ గురించి ప్రధాని ప్రస్తావించారు. భావనా లాంటి నర్సింగ్ స్టాఫ్ వారి కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తూ, అందరికీ స్ఫూర్తినిస్తున్నారన్నారు. అయితే వారంతా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

ఇక, క‌రోనా మ‌హ‌మ్మారికి సంబంధించి సోష‌ల్ మీడియాలో కొంద‌రు త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్నార‌ని, అలాంటి త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌ధాని సూచించారు. కచ్చితమైన వనరుల నుంచే కరోనా వివరాలు తెలుసుకోవాలని సూచించారు. చాలా మంది వైద్యులు కూడా సోష‌ల్ మీడియాలో క‌రోనా మ‌హ‌మ్మారికి సంబంధించిన స‌మాచారాన్ని ఇస్తున్నార‌ని, కోరిన‌వారికి ఉచితంగా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నార‌ని ప్ర‌ధాని తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం రాష్ట్రాలు చేస్తున్న అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాల‌కు కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంటుంద‌ని ప్రధాని సృష్టం చేశారు.

మరోవైపు, కరోనా మరింతగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను అందరూ గుర్తించారని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్ విషయంలో వస్తున్న వదంతులను పట్టించుకోకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు. 45 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా టీకా ఇస్తోందని.. అర్హులంతా ఉచిత టీకాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు వేస్తామన్నారు. కార్పొరేట్​ సంస్థలు తమ ఉద్యోగులకు టీకా వేయించాలని ప్రధాని కోరారు. వీలైనంత ఎక్కువ మంది టీకా తీసుకునేలా రాష్ట్రాలు కృషి చేయాలని కోరారు.