పిలిచి అవమానిస్తారా? మోడీ ముందే మమత ఆగ్రహం

పిలిచి అవమానిస్తారా? మోడీ ముందే మమత ఆగ్రహం

mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్‌కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. శనివారం సాయంత్రం నేతాజీ జయంతి(పరాక్రమ్ దివస్)ని పురస్కరించుకొని విక్టోరియా మహల్ లో నిర్వహించిన కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. మోడీతో పాటు గవర్నర్ జగదీప్ ధన్ కర్,సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, విక్టోరియా మహల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించడానికి సిద్ధమైన సమయంలో సభలోని కొందరు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన మమతా బెనర్జీ.. ఇదేమీ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని గుర్తు చేశారు. ఇక్కడ గౌరవంగా ఉండాలని సభకు హాజరైన వారికి హితవు పలికారు. తనను పిలిచి అవమానిస్తారా? అంటూ మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. తనకు అవమానం జరిగిందని..నిరసనగా తానేమి మాట్లాడనని ముగించారు. కార్యక్రమం ఏర్పాటుచేసిన సంస్కృతిక మంత్రిత్వశాఖకు,హాజరైన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపి వేదికపై నుంచి మమత వెళ్లిపోయారు. అంతకుముందు సభలో నినాదాలు చేస్తున్న వారిని పదేపదే అధికారులు వారించడం వీడియోలో కనిపించింది.

ఆ తర్వాత ప్రధాని మోడీ.. మమతా బెనర్జీని తన సోదరిగా అభివర్ణిస్తూ ప్రసంగించారు. మోడ మాట్లాడుతున్న సమయంలో అక్కడున్నవారు భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. ఈ సభలో భరతమాతను తలచుకోవడం ముదావహమేకానీ, శ్రీరాముడిని తలచుకునే సందర్భం ఇది కాదని మోడీ వ్యాఖ్యానించడం గమనార్హం.

విక్టోరియా మహల్ లో కార్యక్రమానికి ముందు కోల్‌కతాలో మాట్లాడిన మమతా బెనర్జీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సముచిత గౌరవం దక్కలేదని పశ్చిమ అన్నారు. నేతాజీ జయంతిని దేశ్ నాయక్ దివస్‌గా రాష్ట్రం జరుపుకుంటుందని తెలిపారు. నేతాజీని గౌరమిస్తామని చెప్పేవాళ్లు.. ఆయన ఆలోచన నుంచి వచ్చిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారని పరోక్షంగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కాగా, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార తృణమూల్, అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే సువేందు అధికా,రాజీవ్ బెనర్జీ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి కాషాయకండువా కప్పుకోగా..మరికొందుకు కమలం గూటికి చేరేందుకు సిద్దమయ్యారు.