ముగిసిన 6విడత పోలింగ్ : పశ్చిమ బెంగాల్‌‌లో 80 శాతం పోలింగ్!

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 12:32 PM IST
ముగిసిన 6విడత పోలింగ్ : పశ్చిమ బెంగాల్‌‌లో 80 శాతం పోలింగ్!

2019 సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల్లో భాగంగా 6వ దశ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4.30గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తంగా ఆరు గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ పూర్తయిన రాష్ట్రాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. భారీ భద్రత నడుమ కేటాయించిన రూంల వద్దకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

బీహార్ 58 శాతం, హార్యానాలో 63 శాతం, మధ్యప్రదేశ్‌లో 60 శాతం, ఉత్తర్ ప్రదేశ్‌లో 50 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 80 శాతం, జార్ఖండ్‌లో 67 శాతం, ఢిల్లీలో 59 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మొత్తం పోలింగ్ పూర్తయిన తరువాత ఎన్నికల అధికారులు అధికారంగా ప్రకటించనున్నారు. 

7 రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు మే 12వ తేదీ ఆదివారం పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, వెస్ట్ బెంగాల్‌లో 8, బీహార్ 8, మధ్యప్రదేశ్ 8, ఢిల్లీలో 7, జార్ఖండ్ 4 లోక్ సభ స్థానాలున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయమే ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎప్పటిలానే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీనితో ఓటు వేయడానికి ఓటర్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. 

6వ దశలో జరిగిన ఎన్నికల్లో 979 మంది అభ్యర్థులున్నారు. 
1,13,167 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
10.17 కోట్ల మంది ఓటర్లున్నారు.

దేశంలోని మొత్తం 543 స్థానాల్లో మొత్తం 7దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 12వ తేదీ వరకు మొత్తం 483 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 59 స్థానాలకు చివరి దశలో మే నెల 19న పోలింగ్‌ నిర్వహిస్తారు.