బీజేపీకి వత్తాసు….ప్రాణాహాని ఉందన్న టాప్ ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : August 17, 2020 / 03:20 PM IST
బీజేపీకి వత్తాసు….ప్రాణాహాని ఉందన్న టాప్ ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్

హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో​ తన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు ఢిల్లీలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ గా వున్న 49ఏళ్ళ అంఖి దాస్ తెలిపారు.



తనను చంపుతామని బెదిరించడంతో పాటు కొందరు తనపై అభ్యంతరకర సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారని ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ (భారత్‌, దక్షిణ మధ్య ఆసియా) అంఖి దాస్‌ ఢిల్లీ పోలీస్‌ సైబర్‌ విభాగంలో ఫిర్యాదు చేశారు. 5గురు నుంచి తన ప్రాణానికి హాని ఉన్నట్లు ఆమె ఆదివారం ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో తెలిపింది. తాను కంప్లైంట్ లో ప్రస్తావించిన 5గురిని “వెంటనే అరెస్ట్” చేయాలని ఆమె డిమాండ్ చేసింది. పోలీసు రక్షణను కూడా ఆమె కోరింది. ఆన్లైన్ ద్వారా తనకు బెదిరింపులు వచ్చినట్లు అంకిదాస్ తెలిపారు.



ఆగస్టు-14,2020న భారత్‌లో ఫేస్‌బుక్‌ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని అమెరిన్‌ దినపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించిన అనంతరం ఈ వివాదం మొదలైంది అని ఆమె చెప్పారు. ఫేస్‌బుక్ హేట్-స్పీచ్ రూల్స్ కొలైడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్ అనే హెడ్ లైన్ తో వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించబడిన కథనంలో… ఫేస్‌బుక్‌లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనం రాసింది. వివాదాస్పద నేతలపై ‘హేట్‌ స్పీచ్‌’ నిబంధనల కింద చర్యలు తీసుకోకుండా ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ అంకిదాస్‌ అడ్డుపడ్డారని ఆరోపించింది.



భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్‌ దెబ్బతినే ప్రమాదముందని ఫేస్‌బుక్ ప్రతినిధి అంఖీ దాస్‌ ఉద్యోగులతో అన్నట్లు అందులో ఉంది. తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రోహింగ్యా ముస్లింపై చేసిన ఫేస్‌బుక్ పోస్టులనూ ప్రస్తావించింది. రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఫేస్‌బుక్‌ అనుకూలంగా వ్యవహరించిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆరోపించింది.



వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాటల యుద్ధానికి దిగారు. దేశంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తున్నాయి. ఈ సోషల్‌మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ గురించి అమెరికా మీడియా ఎట్టేకలకు బయటపెట్టింది’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘ప్రజలను మెప్పించలేక ఓడిపోయినవారు ప్రపంచం మొత్తాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తున్నాయని భ్రమిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఫేస్‌బుక్‌, కేంబ్రిడ్జ్‌ అనలైటికాతో అంటకాగి అడ్డంగా దొరికింది మీరే. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా?’ అని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ విమర్శించారు.