జమ్మూకాశ్మీర్‌లో ఫైరింగ్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 02:00 AM IST
జమ్మూకాశ్మీర్‌లో ఫైరింగ్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంత్‌నాగ్ జిల్లాలోని బాగేందర్ మొహల్లా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇంతలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పులు జరిపిన సమీప ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది సోదాలు కొనసాగుతున్నాయి.

అనంత్ నాగ్ లో ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లో ఇంకా రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 29, మే 6న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు టార్గెట్  గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ప్రాణ నష్టం కల్పించే విధంగా ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనంత్ నాగ్ ప్రాంతంలో కూంబింగ్  ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మూడు  నెలల్లో 70మంది టెర్రరిస్టులను హతం చేశారు. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు ఇంకా బయటికి వస్తూనే ఉన్నారు.

జమ్మూకాశ్మీర్ లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు.. సరిహద్దుల నుంచి కశ్మీర్ లోకి ప్రవేశిస్తున్నారు. మన దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. భారత జవాన్లు, ఆర్మీ పోస్టులు టార్గెట్ గా టెర్రరిస్టులు దాడులకు తెగబడుతున్నారు.