గుజరాత్ లో బీజేపీకి షాక్…కీలక నేత రాజీనామా

గుజరాత్ లో బీజేపీకి షాక్…కీలక నేత రాజీనామా

MB Vasava Resigns From BJP గుజరాత్ లో​ బీజేపీ కీలక నేత మన్సుక్ వాసవా పార్టీకి రాజీనామా చేశారు. మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన మన్సుక్ వాసవా…బీజేపీకి రాజీనామా చేసినట్లు మంగళవారం(డిసెంబర్-29,2020) ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్ లోని భరూచ్ నియోజకవర్గం నుంచి ఆరవసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మన్సుక్ వాసవా…వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ కు ఈ మేరకు మన్సుక్ వాసవా ఓ లేఖ రాశారు. పార్టీకి తాను విధేయుడిగా కొనసాగానని… పార్టీ విలువలను జాగ్రత్తగా కాపాడానని లేఖలో మన్సుక్ వాసవా పేర్కొన్నారు. అయితే,అన్నింటికన్నా ముందు తాను ఒక మనిషినని అన్నారు. తెలిసో..తెలియకుండానే ఓ మనిషి తప్పులు చేస్తుంటాడని అన్నారు. అయితే తన పొరపాట్ల వల్ల పార్టీకి ఇబ్బందులు కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని మన్సుక్ వాసవా చెప్పారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో..స్పీకర్ ని వ్యక్తిగతంగా కలిసి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వానికి తన నిర్ణయాన్ని తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాసిన లేఖలో మన్సుక్ వాసవా పేర్కొన్నారు.

అయితే, తాను లేవనెత్తుతున్న ఇష్యూస్ పై పార్టీ సరిగా స్పందించడంలేదన్న బాధలో వాసవా ఉన్నారని సమాచారం. రాష్ట్ర బీజేపీ పనితీరుపై కొంతకాలం నుంచే ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తన నియోజకవర్గానికి సంబంధించి వివిధ ఇష్యూస్ ని వాసవా ప్రస్తావిస్తూ వస్తున్నారు. గతవారం ప్రధాని మోడీకి కూడా ఓ లేఖ రాశారు. నర్మద జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్​ జోన్​గా ప్రకటిస్తూ ఇటీవల పర్యావరణ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ గతవారం వాసవా ప్రధానికి లేఖ రాశారు. పర్యావరణం పేరిట గిరిజనుల వ్యక్తిగత వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు మన్సుక్.

కాగా,భరూచ్ నియోజకవర్గానికి 1998లో జరిగిన ఉపఎన్నికల్లో వాసవా తొలిసారి ఎంపీగా గెలిచారు. అనంతరం 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1994లో గుజరాత్​లో ఉపమంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు నరేంద్ర మోడీ కేబినెట్ లో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.