లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం

  • Published By: vamsi ,Published On : April 15, 2020 / 04:46 AM IST
లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం

లాక్ డౌన్ పొడగింపు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై గైడ్ లైన్స్(మార్గదర్శకాలు) విడుదల చేసింది. దేశంలోని ఆసుపత్రులతో పాటు వెటర్నరీ ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, లేబొరేటరీలు, క్లినిక్‌లతో పాటు అత్యవసర విభాగాలన్నీ ఎప్పటిలాగే పనిచేస్తాయి. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు నిర్మాణ భవనం దగ్గరే ఉంటే మాత్రం అక్కడ నిర్మాణాలు జరుపుకోవచ్చు. 

నిత్యవసరాలు మినహా దేశంలోని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలు మూసివేసే ఉంచాలని ఆదేశించింది కేంద్రం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు వంటి వాటికి లాక్‌డౌన్ నుంచి యధాతథంగా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు మే 3 వరకు లాక్‌డౌన్‌లోనే ఉంటాయి.

రక్షణ, కేంద్ర సాయుధ బలగాలు, ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, జాతీయ సమాచార కేంద్రాలు వంటి సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, రాష్ట్రాల్లో పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి వాటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు వంటి సేవలకు  లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ప్రకటనలో తెలిపింది.

దేశంలోని పారిశ్రామిక సంస్థలతో పాటు ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. అన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం వంటి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆరుబయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం.. దానికి భారీ జరిమానా ఉంటుంది. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి ఉండరాదు.