కేంద్రం వ‌ల్లే స‌చిన్‌,ల‌తా మంగేష్క‌ర్ ప‌రువు పోయింది

కేంద్రం వ‌ల్లే స‌చిన్‌,ల‌తా మంగేష్క‌ర్ ప‌రువు పోయింది

Raj Thackeray కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది రైతలు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 74వ రోజుకు చేరాయి. అగ్రి చట్టాలు అందరికీ మేలు చేసేవేనని ప్రభుత్వం వాదిస్తుండగా, వాటిని రద్దు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘాలు భీష్మించుకున్నాయి. ఈ క్రమంలో రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం… వాటిని భారత ప్రభుత్వం తిప్పికొట్టడం, సర్కారుకు మద్దతుగా దేశంలోని ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్న క్రమంలో భార‌త‌ర‌త్న‌లైన ల‌తా మంగేష్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్ అందరికీ టార్గెట్ అయ్యారు.

గడిచిన రెండున్నర నెలలుగా ఉద్యమిస్తోన్న రైతులను పట్టించుకోకుండా, మోడీ సర్కారుకు అనుకూలంగా సచిన్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఇప్పటికే సచిన్ పై సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురుస్తుండగా, కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ గిల్ క్రికెటర్ ‘భారతరత్న’ పురస్కారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అవార్డుకు సచిన్ అనర్హుడని పేర్కొన్నారు. క్రికెట్ కాకుండా ఇతర అంశాలపై మాట్లాడేముందు సచిన్ వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలు అంటించారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ పవార్ ఈ కామెంట్లు చేశారు.

ఇక, ఈ వ్యవహారంపై మహారాష్ట్ర నవనిర్మాణ్ (ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్‌ రాజ్‌ఠాక్రే అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారు తన ప్రతిష్ట కోసం ఇలాంటి లెజెండ్స్ తో తప్పుడు ప్రకటనలు చేయిస్తుండటం గర్హనీయమని ఠాక్రే అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ల్లే భార‌త‌ర‌త్న‌లైన ల‌తా మంగేష్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్ ప‌రువు పోయింద‌ని రాజ్ ఠాక్రే అన్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేయాల‌ని ప్ర‌భుత్వం వీళ్ల‌ను కోరి ఉండాల్సింది కాద‌ని ఆయ‌న అన్నారు. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అంశం త‌ప్ప‌.. దేశానికి చెందిన‌ది కాద‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అక్ష‌ర్ కుమార్‌లాంటి వాళ్ల‌కే ప్ర‌భుత్వం ప‌రిమితం కావాల్సిందన్నారు. ల‌త మంగేష్క‌ర్‌,స‌చిన్ టెండూల్క‌ర్ భార‌త‌ర‌త్న‌లు.. వాళ్లను ట్వీట్లు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం కోరింది.. వాళ్లు చేశారు..త‌ర్వాత ట్రోలింగ్‌కు గుర‌య్యారని ఠాక్రే అన్నారు.