ఆన్ లైన్ క్లాసులకు గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం…ఆ సమయం మించకూడదు

  • Published By: venkaiahnaidu ,Published On : July 14, 2020 / 07:10 PM IST
ఆన్ లైన్ క్లాసులకు గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం…ఆ సమయం మించకూడదు

‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నే విష‌యంలో స్పష్టతలేదు. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఎలాంటి విధానాన్ని రూపొందించలేదు. దీంతో ప‌లువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం(జులై-14,2020) కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ…ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను లేదా గైడ్ లైన్స్ ను ప్రకటించింది. విద్యార్థులకు స్క్రీన్ టైమ్‌పై కుదింపుని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండరాదని తెలిపింది. 1-8 తరగతులకు రెండు ఆన్‌లైన్ సెషన్‌లు 45 నిమిషాల వరకు, 9-12 తరగతులకు 30-45నిమిషాల వరకు నాలుగు సెషన్‌లు నిర్వహించాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

విద్య యొక్క నాణ్యతను పెంచడానికి ఆన్‌లైన్ విద్యను ముందుకు తీసుకెళ్లడానికి మార్గదర్శకాలు రోడ్‌మ్యాప్ లేదా పాయింటర్లను అందిస్తాయని ఇవాళ గైడ్ లైన్స్ విడుదల సందర్భంగా కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నారు. పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు విద్యార్థులతో సహా విభిన్నమైన వాటాదారులకు ఈ మార్గదర్శకాలు సంబంధితంగా మరియు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. NCERT ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్‌ను ఉపయోగించడంపై కూడా మార్గదర్శకాలు నొక్కిచెప్పాయి.