చిల్లర రాజా: నాణేలతో నామినేషన్ వేసిన అభ్యర్ధి

  • Published By: chvmurthy ,Published On : March 26, 2019 / 02:56 PM IST
చిల్లర రాజా: నాణేలతో నామినేషన్ వేసిన అభ్యర్ధి

చెన్నై: దేశంలో ఎన్నికల హవా నడుస్తోంది.అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు మందీ మార్బలంతో హాడవిడి చేస్తుంటారు.కానీ తమిళనాడులో ఓ అభ్యర్ధి తన నామినేషన్ ను వెరైటీగా దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 న తొలివిడత పోలింగ్ జరుగనుంది. తొలి విడత పోలింగ్ జరిగే స్దానాలకు మార్చి 25 తో నామినేషన్ల గడువు ముగిసింది. రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.  

చెన్నైలోని సౌత్  పార్లమెంట్ నియోజక వర్గానికి   ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కుప్పల్జి దేవదాస్  అనే వ్యక్తి నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ ఆఫీసరు కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కుప్పల్జి 25 వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఐతే ఆ మొత్తాన్ని కుప్పల్జీ చిల్లర నాణేల రూపంలో చెల్లించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 25 వేల రూపాయల మొత్తానికి గాను ఆయన 10, 5, 2 రూపాయల నాణేలను 13  పాత్రల్లో  తీసుకువచ్చి చెల్లించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.  మొత్తం 39 ఎంపీ స్ధానాలకు ఏప్రిల్ 18 న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.