India Covid 19 Cases : ఇండియాలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? ఒక్కరోజే 50వేలు దాటిన కరోనా కొత్త కేసులు

India Covid 19 Cases : ఇండియాలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? ఒక్కరోజే 50వేలు దాటిన కరోనా కొత్త కేసులు

India Covid 19

India Covid 19 Cases : దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదా? రోజువారీ నమోదవుతున్న కరోనా కొత్త కేసులు చూస్తుంటే ఈ ప్రశ్న కలగక మానదు. దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. తాజాగా కోవిడ్ కొత్త కేసుల సంఖ్య 50వేలు దాటడం భయాందోళనకు గురి చేస్తోంది.

పెరుగుతున్న యాక్టివ్ కేసులు, మరణాలు:
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల నిద్ర లేకుండా చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే బుధవారం(మార్చి 24,2021) రికార్డు స్థాయిలో పాజటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 10.65లక్షల కరోనా పరీక్షలు చేయగా.. 53వేల 476 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 17లక్షల 87వేల 534కి చేరింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 275 నమోదు కాగా.. బుధవారం 251 మంది చనిపోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాకు బలైన వారి సంఖ్య ఒక లక్ష 60వేల 692కి చేరింది. మరణాల రేటు 1.37 శాతానికి చేరింది.

కొత్తగా 26వేల 490 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య కోటి 12లక్షల 31వేల 650కు చేరి.. రికవరీ రేటు 95.49శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,95,192కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం(మార్చి 25,2021) తెలిపింది.

మహారాష్ట్రలో ఒక్కరోజే 32వేలకు పైగా కేసులు:
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కోరలు చాచింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 32వేల 855 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5వేలకు పైగా కేసులు వెలుగుచూడటం టెన్షన్ పెడుతోంది. గడిచిన 24 గంటల్లో 95 మంది కరోనాతో మరణించగా.. 15వేల 098 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.87కోట్ల నమూనాలు‌ పరీక్షించగా 25.64లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22.62లక్షల మంది కోలుకోగా.. 53వేల 684 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2.47లక్షల వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధిక శాతం ఒక్క మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి.

తెలంగాణలో డేంజర్ బెల్స్:
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగించింది. రాష్ట్రంలో కొత్త కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో నిన్న(మార్చి 24,2021) రాత్రి 8 గంటల వరకు 56వేల 464 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 493 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,791కి చేరింది.

నిన్న కొవిడ్‌తో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,680కి చేరింది. కరోనా నుంచి నిన్న 157 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,427కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,684 ఉండగా.. వీరిలో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 138 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 98,45,577కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం(మార్చి 25,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలోనూ కరోనా కలకలం:
ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల 300లకే పరిమితమైన కేసులు కాస్తా 500లకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 585 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున (3) కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 89,51,121 కి పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,197 కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 24,2021) సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 251 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,978 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల 946 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. గత 24 గంటల్లో 35,066 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,48,40,401 కరోనా టెస్టులు చేశారు.