యూఎస్ ని శాసించే స్థాయిలో భారతీయ-అమెరికన్లు : బైడెన్

యూఎస్ ని శాసించే స్థాయిలో భారతీయ-అమెరికన్లు : బైడెన్

Indian-Americans భారత సంతతి అమెరికన్లు యూఎస్ లో కీలకంగా మారుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దేశంలో ఇండియన్ అమెరికన్ల ప్రాధాన్యత పెరుగుతుందని,తన ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో అనేక మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఇటీవల నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ‘పర్సర్వెన్స్’ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందంతో గురువారం బైడెన్​ వర్చువల్​గా మాట్లాడారు.

నాసా మార్స్ 2020 మిషన్ గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్‌‌కు నాయకత్వం వహించిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త స్వాతి మోహన్ తో పాటు ఇతర భారతీయ అమెరికన్లపై ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు బైడెన్. నాసా టీమ్ తో మాట్లాడేందుకు సమయం కేటాయించినందుకు అధ్యక్షుడు బైడెన్ కు స్వాతి మోహన్ ధన్యవాదాలు చెప్పగా… బైడెన్ మాట్లాడుతూ..మీరు ఆటపట్టిస్తున్నారా?ఎంత గొప్ప గౌరవం ఇది.ఇదొక అద్భుతమైన గౌరవం. భారత సంతతికి చెందిన అమెరికన్లు దేశాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. మీరు (స్వాతి మోహన్), మా ఉపాధ్యక్షురాలు (కమలా హ్యారిస్), మా స్పీచ్ రైటర్ (వినయ్ రెడ్డి) వంటి వారే ఇందుకు నిదర్శనం. మీరొక అద్భుతమైన వ్యక్తులు అంటూ భారతీయ అమెరికన్లు తెగ పొగిడారు బైడెన్.

అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా ఒకశాతం కంటే తక్కువే. అయినా, అమెరికా వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు భారతీయ అమెరికన్లు. గతంలో ఒబామా హయాంలోనూ పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యత దక్కింది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంలో వెనుకడుగు వేయలేదు. తొలిసారి ఓ భారతీయ-అమెరికన్‌ను క్యాబినెట్ ర్యాంకు హోదాలో జాతీయ భద్రతా మండలిలో నియమించారు ట్రంప్. ప్రస్తుతం బైడెన్ యంత్రాంగంలో మెజార్టీ సభ్యులు భారతీయ అమెరికన్లు కావడం విశేషం. తన యంత్రాంగంలో వివిధ మూలాలున్న వారికి అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు.

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టిన బైడెన్.. తన యంత్రాంగంలో కనీసం 55 మంది భారతీయులకు కీలక బాధ్యతలను కట్టబెట్టారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, వైట్‌హౌస్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ నీరా టాండన్ సహా సగం మంది భారతీయ సంతతి మహిళలు శ్వేతసౌధంలో కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికాకు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతి వ్యక్తి కమలా హ్యారిస్ నియమించబడటం విశేషం.