3రూపాయల 46 పైసల అప్పు కోసం రైతును 15 కి.మీ. నడిపించిన బ్యాంకు అధికారి

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 05:02 AM IST
3రూపాయల 46 పైసల అప్పు కోసం రైతును 15 కి.మీ. నడిపించిన బ్యాంకు అధికారి

కర్ణాటక షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో బ్యాంకులు రైతుల పట్ల చూపించే వివక్షకు ఉదాహరణగా ఓ దారుణ ఘటన జరిగింది. కేవలం 3 రూపాయల 46 పైసల అప్పు చెల్లించడం కోసం ఓ బ్యాంకు ఉద్యోగి ఓ రైతును దాదాపు 15 కిలో మీటర్ల దూరం నడిపించాడు.

 

వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు చెక్కేసి బ్యాంకులకు టోపీలు వేస్తున్న ఆర్థిక నేరగాళ్ల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయలేని బ్యాంకులు..వ్యవసాయం కోసం తీసుకున్న అప్పులు తీసుకున్న రైతన్నలను మాత్రం బెదిరించి మరీ వసూలు చేస్తున్న ఘటనలకు ఈ దారుణం సందర్భం ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

 

అమాదే లక్ష్మీనారాయణ అనే చిన్న రైతు వక్కల పెంపకం వ్యవసాయం చేస్తుంటాడు. అతను సమీపంలోని పట్టణంలో ఉన్న కెనరా బ్యాంకు నుంచి రూ. 35 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో రూ.32 వేలు మాఫీ అయింది. మిగిలిన రూ.3 వేలను కూడా ఆ రైతు బ్యాంకుకు చెల్లించేశాడు. దీంతో రుణం మొత్తం తీరిపోయింది.

 

పాత అప్పు కట్టేశాను కాబట్టి బ్యాంకు నుంచి మరోసారి లోనుతీసుకోవచ్చని అనుకున్నాడు. కానీ..ఒకరోజు ఆ రైతుకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు తీసుకున్న లోను మొత్తం కట్టలేదని వెంటనే రావాలని బ్యాంకు అధికారి చెప్పాడు. దీంతో రైతు గాబరా పడిపోయాడు. అదేంటీ మొత్తం బాకీ కట్టేశానే అనుకుంటూ లక్ష్మీనారాయణ ఆదరాబాదరాగా బ్యాంకు వెళ్లడానికి రెడీ అయ్యాడు.

 

కానీ..కరోనా లాక్ డౌన్ తో బస్సులు తిరగటంలేదనే విషయం గుర్తుకొచ్చింది. దీంతో వేరే దారిలేక నడుచుకుంటూ బ్యాంకు వెళ్ళాడు. బ్యాంకు అధికారి రూ.3 రూపాయల 46 పైసల అప్పు బాకీ ఉందని..వెంటనే కట్టేయాలని పీకమీద కూర్చున్నాడు. దీంతో లక్ష్మీనారాయణ షాక్ అయ్యాడు.

 

ఈ మాత్రం అప్పు కోసం ఈ లాక్ డౌన్ సమయంలో 15 కిలోమీటర్లు నడిపించారని వాపోయాడు. తనకు ఫోన్ చేసిన బ్యాంకు అధికారి ఫోన్ లోనే ఈ మాట చెప్పొచ్చుకదా అంటూ ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ 3 రూపాయల 46పైసల అప్పు బ్యాంకు అధికారుల అప్పును ఇచ్చి (కోపంతో ముఖాన నట్లుగా ఇచ్చి) వెళ్ళిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎల్ పింగ్వా స్పందిస్తూ.. కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనీ అందువల్లే ఆ డబ్బుని అడిగామని తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read: ఆన్ లైన్ క్లాసుల పేరుతో కార్పొరేట్ స్కూల్స్ అధిక ఫీజుల దందాలు