రైతులు మద్దతుగా జాట్‌లు, రెండు రోజులు ఇంటర్నెట్ బంద్

రైతులు మద్దతుగా జాట్‌లు, రెండు రోజులు ఇంటర్నెట్ బంద్

Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే.. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన హింసాకాండ తర్వాత ఇంటి ముఖం పట్టిన వేలాది మంది రైతులు మళ్లీ ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన హోంశాఖ ఇంటిలిజెన్స్‌ అధికారుల సమాచారం మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు‌, ఘాజీపూర్‌, టిక్రి ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఇంటర్‌నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. దేశ రాజధాని సమీపంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ఇంటర్‌నెట్‌ను నిలిపిస్తున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. కన్నీటి చుక్కలు వేల మంది రైతుల హృదయాల్ని కదిలించాయి… చల్లారిపోతున్న ఉద్యమానికి కొత్త ఊపునందించాయి… యూపీ, హర్యాణాల నుంచి వేలాదిగా అన్నదాతలు కదం తొక్కేలా చేశాయి. తుపాకీ పట్టిన భద్రతా బలగాలను వెనకడుగు వేసేట్లు చేశాయి. రైతుల ఉద్యమానికి విఘాతం కలిగించేలా యూపీ ప్రభుత్వం యత్నిస్తోందని… రైతు సంఘ నేత రాకేష్ తికాయత్ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఢిల్లీలోని ఇతర సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులంతా.. ఘాజీపూర్‌కు చేరుకుంటున్నారు.

రాత్రికి రాత్రే ఘాజీపూర్‌ సరిహద్దుల్లో వందలాది శిబిరాలు వెలిశాయి. రైతులు మద్దతుగా జాట్‌లు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఉన్నా సరే జాట్‌ యువత ఢిల్లీకి చేరుకోవాలని చెప్పడంతో.. వేలాది మంది తికాయత్‌కు మద్దతుగా ఘాజీపూర్‌లో దిగారు. ఇప్పటివరకు కేవలం రైతుల ఆందోళనగా సాగుతున్న ఉద్యమం… ఇపుడు జాట్‌ రైతుల ఆందోళనగా మారింది. దాంతో రైతుల ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.. ఉద్యమం ఇంకా ఉధృతమవుతూనే ఉంటుంది కానీ తగ్గదంటూ.. రైతులు అంటున్నారు.

జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. అది ప్రభుత్వం చేసిన కుట్రేనంటూ విమర్శిస్తున్నారు. బీజేపీ మద్దతుదారులే హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు చెప్పిన నేతలు.. వాటితో మాకెలాంటి సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు రైతులకు మద్దతుగా జాట్‌లు అక్కడికి చేరుకోవడంతో.. రైతుల ఉద్యమం మరో మలుపు తిరిగింది. జాట్‌ రైతులకు సహకరించడంలో.. లోక్‌ దళ్‌ అధినేత, మాజీ వ్యవసాయ మంత్రి అజిత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. రాకేష్ తికాయత్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ఘాజీపూర్‌లో రైతులు చేస్తున్న ఉద్యమానికి జాట్ మద్దతు ఉంటుందని తెలిపారు.