లాలూ ఆడియో క్లిప్‌ కలకలం…దర్యాప్తుకు జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : November 26, 2020 / 05:55 AM IST
లాలూ ఆడియో క్లిప్‌ కలకలం…దర్యాప్తుకు జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశం

Lalu Yadav’s “Poaching” Audio Clip బీహార్ లోని అధికార ఎన్‌డీఏకు చెందిన ఎంఎల్‌ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ యత్నిస్తున్నారని బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోడీ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.

నితీశ్‌ కుమార్‌ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లాలూ ప్రసాద్ యాదవ్ శాసన సభ్యులను ప్రలోభపరుస్తున్నారంటూ సుశీల్ కుమార్ మోడీ ‌ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్నఆ ఆడియోలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌..ఎన్‌డీఏ MLA లలన్‌ కుమార్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది.



నిన్ను బాగా చూసుకుంటాం. స్పీకర్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓడిపోయేందుకు సాయం చెయ్యి అని లాలూ అంటున్నట్లు ఆడియోలో ఉంది. ఇందుకు ఎంఎల్‌ఏ బదులిస్తూ ఇందుకు చాలా ఇబ్బందులుంటాయని చెప్పగా, భయపడవద్దని, ఆర్‌జేడీ స్పీకర్‌ వస్తారని, ఇందుకుగాను తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి ఇస్తామని లాలూ చెబుతున్నట్లుంది. సుశీల్‌తో తాను ఉన్నప్పుడే లాలూ కాల్‌ చేశారని సదరు ఎంఎల్‌ఏ చెప్పారు.



ఈ ఆడియోక్లిప్‌పై ఆర్‌జేడీ ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ఆ పార్టీ ఎంఎల్‌ఏ ముకేశ్‌ రోషన్‌ మాత్రం మార్చికల్లా నితీశ్‌ ప్రభుత్వం పడిపోయి, తేజస్వీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మరోవైపు బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్‌డీఏకి చెందిన విజయ్‌ సిన్హా ఎన్నికయ్యారు.



https://10tv.in/mamata-banerjee-dares-bjp-to-arrest-her-says-will-ensure-tmc-victory-in-polls-from-jail-itself/
ప్రస్తుతం లాలూ పశుగ్రాసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2017 డిసెంబర్ నుంచి రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే,అనారోగ్య కారణాలతో ఇటీవల లాలూ.. రిమ్స్ లో చేరారు. ఇటీవల లాలూని రిమ్స్ డైరెక్టర్ బంగ్లాకి తరలించారు.



బీహార్ అసెంబ్లీ స్పీకర్‌కు ఎన్నికల సమయంలో ఎన్‌డీఏ ఎమ్మెల్యేతో లాలూ మాట్లాడారన్న ఆరోపణలపై లాలూ ప్రసాద్‌పై దర్యాప్తునకు జార్ఖండ్ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. ఈ విషయంపై విచారించాలని, ఆరోపణలు నిజమని తేలితే చట్టబద్ధమైన చర్యలను ప్రారంభించాలని రాంచీ డిప్యూటీ కమిషనర్, పోలీస్ సూపరింటెండెంట్, బిర్సా ముండా జైలు సూపరింటెండెంట్లను కోరినట్లు ఇన్స్పెక్టర్ జనరల్(జైళ్లు) వీరేంద్ర భూసన్ తెలిపారు.