మూడు వరల్డ్ రికార్డులతో.. ముగిసిన కుంభమేళా

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2019 / 04:11 AM IST
మూడు వరల్డ్ రికార్డులతో.. ముగిసిన కుంభమేళా

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా సోమవారం ఘనంగా ముగిసింది.మకరసంక్రాంతి (జనవరి-15,2019)న ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాశివరాత్రి(మార్చి-4,2019) రోజు ముగిసింది. మొత్తం 49 రోజుల పాటు కుంభమేళా ప్రశాంతంగా,ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. చివరి రోజైన మహాశివరాత్రి(మార్చి-5,2019) నాడు పవిత్ర త్రివేణి సంగమంలో 1.10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ప్రపంచంలోనే మతపరంగా అతిపెద్ద కార్యక్రమమమే కాకుండా ఖరీదైన ఉత్సవంగా కూడా కుంభమేళా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కుంభమేళాకు యూపీ ప్రభుత్వం రూ.4,200 కోట్లు కేటాయించింది. 2013లో మహాకుంభమేళాకు కేటాయించిన నిధులకన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. అంతేకాకుండా అతిపెద్ద క్రౌడ్ మేనేజ్ మెంట్, ఒకేసారి 10 వేల మంది పారిశుధ్య కార్మికులు పరిశుభ్రత చర్యలు చేపట్టడం, పబ్లిక్ సైట్స్ లో అతిపెద్ద పెయింటింగ్ కార్యక్రమాల్లో 2019 ప్రయాగ్ రాజ్ కుంభమేళా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 2019 కుంభమేళాలో మొత్తం 22.05 కోట్ల మంది పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.