సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 01:35 AM IST
సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం (మే 6,2019) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 51 నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 12శాతం మంది మహిళలే. ఈ 51 నియోజకవర్గాల్లో 9 కోట్ల మంది ఓటర్లున్నారు. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారంతో పోలింగ్‌ ముగుస్తుంది. ఈ నియోజకవర్గానికి 3, 4 దశల్లోనూ పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

పలువురు హేమాహేమీలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ గాంధీ(అమేథీ), యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ(రాయ్ బరేలీ), కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జౌళిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ(అమేథీ) తదితరులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు 5వ దశలోనే పోలింగ్‌ జరుగుతోంది. కేంద్ర సహాయ మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, జయంత్‌సిన్హా, ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మాజీ ఒలింపిక్‌ క్రీడాకారులు రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, కృష్ణపునియా తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాలకు కూడా ఈ దశలోనే పోలింగ్‌ జరుగుతోంది.

రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, రాజస్తాన్‌లో 12, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చెరో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌లోని లడక్ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 96వేల పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

5వ దశతో 424 లోక్ సభ స్థానాలకు పోలింగ్‌ ముగుస్తుంది. మిగిలిన 118 స్థానాలకు 6వ (మే 12), 7వ (మే 19) దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. మే 23వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. 2014 ఎన్నికల్లో ఈ 51 నియోజకవర్గాల్లోని 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లు వచ్చాయి. మిగిలిన స్థానాలు తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.