Sachin,Sara Love story : నాడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల ప్రేమ పెళ్లి…నేడు విడాకులు

19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడైంది....

Sachin,Sara Love story : నాడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల ప్రేమ పెళ్లి…నేడు విడాకులు

Sachin Pilot,Sara Abdullah

Sachin,Sara Love story : రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాలు రహస్యంగా విడాకులు తీసుకున్న విషయం ప్రస్థుత అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో వెలుగుచూసింది. 19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడైంది. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.

ఆసక్తికరంగా ప్రేమకథ

సచిన్ పైలట్ తన భార్య పేరు ముందు విడాకులు అని రాశాడు. అయితే, సచిన్ సారా పైలట్ పేరును కూడా ప్రస్తావించి, ఆమె ఆస్తుల వివరాలను కూడా తెలిపారు. సచిన్ పైలట్ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె సారా పైలట్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. సారా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోదరి. నాడు సచిన్ పైలట్, సారా పైలట్ ల ప్రేమకథ చాలా ఆసక్తికరంగా సాగింది.

అమెరికా వర్శిటీలో చిగురించిన ప్రేమ 

వీరిద్దరూ 19 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సచిన్ పైలట్ అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ చదివారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె, ఒమర్ అబ్దుల్లా సోదరి సారాను కలిశారు. మొదట వారిద్దరూ స్నేహితులయ్యారు. కాలక్రమేణా ఈ స్నేహం ప్రేమగా మారింది. సారా అమెరికాలోనే ఉండగా, సచిన్ పైలట్ కోర్సు పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇద్దరి మధ్య దూరం ఈ ప్రేమకు మరింత బలం చేకూర్చింది.

మూడేళ్లు దూరంగా…

సచిన్, సారాలు 3 సంవత్సరాల పాటు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. చివరకు వారు తమ సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు, కానీ వారి ముందు సవాళ్లు పెద్దవిగా ఉన్నాయి. మొదట్లో అబ్దుల్లా కుటుంబం ఈ ప్రేమ పెళ్లికి వ్యతిరేకమని చెబుతున్నారు. సచిన్-సారా సంబంధాలు బహిరంగం అయినప్పుడు కూడా ప్రజలు లోయలో అబ్దుల్లా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారాలు ప్రారంభించారు. దీంతో ఆ పార్టీలోని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కొంత కాలం ఓపిక పట్టారు.

2004లో ప్రేమ వివాహం

మూడేళ్ల తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో చివరకు 2004 జనవరిలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ వివాహ వేడుకకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వివాహాన్ని అబ్దుల్లా కుటుంబం గుర్తించలేదు. సచిన్ పైలట్ తల్లి కూడా మొదట్లో వీరి పెళ్లిని వ్యతిరేకించింది. అయితే సారాతో వివాహం అనంతరం సచిన్ పైలట్‌కు అదృష్టంగా మారింది.

చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నిక 

ఆ తర్వాత సచిన్ అసలు రాజకీయ ప్రయాణం మొదలైంది. సచిన్ పైలట్ కేవలం 26 సంవత్సరాల వయసులోనే ఎంపీ అయ్యారు. తన తండ్రి రాజేష్ పైలట్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ సచిన్ దౌసా పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎన్నికయ్యారు. ఎట్టకేలకు సచిన్, సారాల వివాహాన్ని ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం అంగీకరించింది.

ఐదేళ్లలో రెండింతలు అయిన సచిన్ సంపద

సచిన్ పైలట్ సంపద ఐదేళ్లలో దాదాపు రెండింతలు పెరిగిందని ఎన్నికల అఫిడవిట్ వెల్లడించింది. 2018 అఫిడవిట్‌లో సచిన్ తన ఆస్తులను రూ. 3.8 కోట్లుగా ప్రకటించగా, ఈ సంవత్సరం అంటే 2023 నాటికి అది దాదాపు రూ.7.5 కోట్లకు పెరిగింది. సచిన్ పైలట్, సారా అబ్దుల్లాలకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు అరన్ పైలట్, విహాన్ పైలట్. ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారులను డిపెండెంట్లుగా సచిన్ పైలట్ పేర్కొన్నారు.