కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కాపాడిన కరోనా వైరస్…సుప్రీంలో బీజేపీ పిటిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2020 / 10:42 AM IST
కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కాపాడిన కరోనా వైరస్…సుప్రీంలో బీజేపీ పిటిషన్

కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగా కమల్ నాథ్ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోవాలని అన్నారు.

కమల్ నాథ్ సర్కార్ ఇవాళే బలపరీక్షను ఎదుర్కోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మాస్క్ లు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు ఎమ్మెల్యేలందరూ. ఫ్లోర్ టెస్ట్ ఇవాళ జరుగకుంటే సుప్రీంకోర్టుకు వెళతాం అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే గవర్నర్ ప్రసంగం అనంతరం….కరోనా వైరస్ దృష్ట్యా స్పీకర్ ఎన్ పీ ప్రజాపతి మార్చి-26వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి-26న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలనిరూపణకు అవసరమైన మెజార్టీ అధికార కాంగ్రెస్ దగ్గర లేదన్న విషయం తెలిసిందే.

See Also | కరోనా మాస్క్‌ల తయారీలో కేరళ ఖైదీల రికార్డు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే మాజీ సీఎం,బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.  కరోనా వైరస్ కూడా కమల్ నాథ్ సర్కార్ ను సేవ్ చేయలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అయితే కమల్ నాథ్ ప్రభుత్వం అసెంబ్లీ బల నిరూపణ నుంచి తప్పించుకుంటుందని సాత్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ఆరోపించారు. సభలో మెజార్టీ లేదు అని తెలుసు కనుకనే కమల్ నాథ్ ఫ్లోర్ టెస్ట్ నుంచి దూరంగా పారిపోతున్నాడని ఆయన అన్నారు.

అసెంబ్లీలో మెజార్టీ లేని కలమ్ నాథ్ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. మెజార్టీ లేనప్పటికీ అధికారంలో కొన్ని రోజులు కొనసాగేందుకు కరోనా వైరస్ ను కమల్ నాథ్ ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నాడని ఆయన తెలిపారు.

కరోనా సాకుతో కమల్ నాథ్ ప్రభుత్వం బలపరీక్షతో సహా,అసెంబ్లీని వాయిదా వేసిందంటూ బీజేపీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వెంటనే కమల్ నాథ్ సర్కార్ బలపరీక్షను నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ ఆ పిటిషన్ లో కోరింది. బీజేపీ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది.