మహా రాజకీయం…ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2019 / 02:17 PM IST
మహా రాజకీయం…ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్నాటు చేసేందుకు బీజేపీకి అవకాశమిచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. నవంబర్-11,2019లోగా దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. బీజేపీ లేజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఫడ్నవీస్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎన్నుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగిసిన విషయం తెలిసిందే. అదే రోజు సీఎంగా ఫడ్నవీస్ రాజీనామా చేసి ప్రస్తుతం తాత్కాలిక సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఫడ్నవీస్ ను ఇవాళ(నవంబర్-9,2019) ఆహ్వానించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 105మంది ఎమ్మెల్యేలు ఉండగా,స్వతంత్రులుగా గెలిచిన 29మంది ఎమ్మెల్యేలలో 15మంది ఇప్పటికే బీజేపీ జై కొట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 145 మంది మద్దతు అవసరముండగా ఇంకా బీజేపీకి 25మంది సభ్యుల మద్దతు అవసరముంది. 

సీఎం పదవికి శుక్రవారం రాజీనామా చేసిన అనంతరం ఫడ్నవీస్ శివసేనపై తీవ్ర విమర్శలు చేశారు.సీఎం సీటుని చెరో రెండున్న సంవత్సరాలు పంచుకునేందుకు ఎన్నికల ముందు బీజేపీ ఒప్పుకుందంటూ శివసేన ప్రకటనలు చేస్తుందని,శివసేనతో అలాంటి ఒప్పందం జరగలేదని ఫడ్నవీస్ అన్నారు. ప్రజల తీర్పుని శివసేన గౌరవించడం లేదన్నారు. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, బీజేపీ వ్యక్తే మహారాష్ట్రలో సీఎం సీటులో ఉంటారన్నారు. దీనిపై శివసేన కూడా ఘాటుగానే స్పందించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. శివసేన వ్యక్తే సీఎంగా ఉంటారని తేల్చిచెప్పారు. శివసేన వ్యక్తిని సీఎం చేయడానికి అమిత్ షా,ఫడ్నవీస్ ఆశీర్వాదం అక్కర్లేదన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్నాటు చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీనే అబద్దాలు చెబుతుందని ఉద్దవ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషచయం తెలిసిందే.