దీదీకి సొంత వాహనం లేదంట, 20 ఏళ్లలో సంపాదించిన ఆస్తులు

దీదీకి సొంత వాహనం లేదంట, 20 ఏళ్లలో సంపాదించిన ఆస్తులు

Mamata

Mamata Banerjee : మమతా బెనర్జీ పరిచయం అక్కర్లేని పేరు. అసలు సిసలైన ఫైర్‌బ్రాండ్. దాదాపు నలభై ఏళ్లుగా క్రీయశీల రాజకీయాల్లో ఉన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మరో పదేళ్లు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో సగంకాలం పాటు అధికారంలో ఉన్నారు మమత. అయితే ఈ ఇరవై ఏళ్లలో మమత సంపాదించిన ఆస్తులు కేవలం 16 లక్షల 72 వేల రూపాయలు. ఎన్నికల అఫిడివిట్‌లో మమతా బెనర్జీ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఇందులో తనకు ఉన్న ఆస్తుల విలువ 16 లక్షల రూపాయలని, నగదు కేవలం 69 వేల 255 రూపాయలు ఉందని తెలిపారు. తన పేరు మీద కనీసం సొంత వాహనం కూడా లేదని చెప్పారు దీదీ. వీటితో పాటు 43 వేల రూపాయల విలువైన 9 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు.

మిగిలిన రాజకీయ నాయకులు ఎవరైనా ఇలా అఫిడివిట్‌ ఇస్తే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నా .. మమత బెనర్జీ సాధారణ జీవితం గడుపుతారు. కేవలం ఒక్క రూపాయే జీతం తీసుకుంటారు. ఇతర అలవెన్సులు కూడా తీసుకోరు. తెల్లని కాటన్‌ చీర, హవాయి చెప్పులే ధరిస్తారు. ఆభరణాలు ధరించరు. తను రచించిన పుస్తకాలు, గీసిన పెయింటింగ్స్‌ మీద వచ్చే రాయల్టీనే ఆమెకు వచ్చే ఆదాయం. దాంతోనే వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేస్తుంది ఫైర్‌ బ్రాండ్‌.

బుధవారం సాయంత్రం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన తోపులాటలో గాయపడి కోల్ కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..హాస్పిటల్ నుంచి తృణముల్ పార్టీ కార్యకర్తలకు సందేశమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మమత ఓ వీడియో రిలీజ్ చేశారు. నందిగ్రామ్‌ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవీకరించారు.

ఎంఆర్‌ఐ స్కానింగ్ తీశాక గాయాలను నిర్ధారించిన వైద్యులు… ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 48 గంటల పాటు పరిశీలనలో ఉంచుతామన్నారు. ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు, ఊపిరి పీల్చకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు దీదీ చెబుతున్నారని వైద్యులు తెలిపారు. వీల్ చైర్ లో కూర్చుని మరీ ఎన్నికల ప్రచారం చేస్తానంటూ తనదైన స్టైల్లో చెప్పారు మమతా బెనర్జీ.